సంక్షిప్త వార్తలు (11)

రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్‌మార్క్‌ తెలిపారు.

Updated : 05 Jul 2024 06:45 IST

వైకాపా హయాంలో ఇబ్బందులు పడ్డాం
ఎన్డీయేకు అండగా ఉంటాం.. క్రిస్టియన్‌ సంఘం

ఐక్యత చాటుతున్న జాన్‌మార్క్, నవీన్‌కుమార్, డేవిడ్‌మార్క్, శేఖర్‌బాబు తదితరులు

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్‌మార్క్‌ తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో క్రైస్తవులు చాలా ఇబ్బందులు పడ్డారని, వారిపై దాడులు చేయడమే కాకుండా ఆస్తులు కబ్జా చేశారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలోనే తమకు రక్షణ ఉందని, తమపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కబ్జాకు గురైన క్రైస్తవ శ్మశానవాటికలు, స్థలాలను గుర్తించి తిరిగి కేటాయించాలని కోరారు. క్రైస్తవులంతా ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.నవీన్‌కుమార్, కార్యదర్శి డేవిడ్‌ మార్క్, కోశాధికారి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 


కాడా కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్‌

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర జలవనరుల శాఖ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్‌ (ఎఫ్‌ఏసీ)గా ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ నియమితులయ్యారు. విజయవాడ హనుమాన్‌పేటలోని కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా ఉన్న శ్రీధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్‌గా నియమించారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా ఉన్న విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి కె.ఎస్‌.రాఘవయ్య రాజీనామా చేశారు. 


పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ ఛైర్మన్‌గా టీఎంబీ బుచ్చిరాజు, ఛైర్మన్‌గా పీఎస్‌.కుమార్, ప్రధాన కార్యదర్శిగా సి.బాలాజీ, కోశాధికారిగా బి.ప్రభురెడ్డి, ముఖ్య సలహాదారుగా జీఎల్‌ఎస్‌వీ రాఘవన్‌ ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ముగ్గురు కో-ఛైర్మన్లు, పది మంది సలహాదారులు, ఏడుగురు వైస్‌ ఛైర్మన్లు, 25 మంది జోనల్‌ సెక్రటరీలను ఎన్నుకున్నట్లు అసోసియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ బుచ్చిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఉచిత ఇసుక విధానంపై క్రెడాయ్‌ హర్షం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంపై క్రెడాయ్‌ హర్షం వ్యక్తం చేసింది. నిర్మాణరంగానికి ముడిసరుకైన ఇసుక లభ్యతపై కొంతకాలం నుంచి బిల్డర్లు, సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం ఇచ్చామని క్రెడాయ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వై.వి.రమణారావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు తెలిపారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి స్పందించి కొత్త పాలసీని తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.


నా భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి: హైకోర్టులో అంబటి వ్యాజ్యం 

ఈనాడు, అమరావతి: తనకు ప్రాణహాని ఉందని, గతంలో కల్పించిన 4+4 పోలీసు భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైకాపా నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయమై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి గురువారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.


‘ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న సమావేశం కానున్న నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, అంజయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 712 మంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపించాలని గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. ‘గతంలో ఉద్యోగుల ఇష్టానికి వ్యతిరేకంగా కమలనాథన్‌ కమిటీ ఏపీకి కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం కేవలం 3, 4వ తరగతుల ఉద్యోగులను మాత్రమే వెనక్కి తీసుకుంది. ఆపై స్థాయి ఉద్యోగులకు అవకాశం కల్పించలేదు. సీఎంల భేటీలో మా సమస్యలపై చర్చించాలి’ అని కోరారు.


‘తమిళనాడులో తెలుగును బతికించండి’

ఈనాడు, అమరావతి: తమిళనాడులో తెలుగుభాషను బతికించడానికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి తెలుగు వారి సమస్యలు పరిష్కరించేలా చూడాలని అన్నారు. గురువారం ఆయన సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఏపీలో ఇంటర్‌ వరకు మాతృభాషలో చదువుకునేలా చర్యలు చేపట్టాలని, తితిదేలో కుంభకోణాలను బయటకు తీయాలని కోరారు.


కడప ప్లాంటు సామర్థ్యాన్ని పెంచిన దాల్మియా సిమెంట్స్‌

ఈనాడు, అమరావతి: కడప యూనిట్‌లో అదనంగా ఏడాదికి మరో మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తిని ప్రారంభించినట్లు దాల్మియా భారత్‌ లిమిటెడ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఏడాదికి 2.6 మిలియన్‌ టన్నులకు అదనంగా ఉత్పత్తి చేసేలా ప్లాంటు సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు పేర్కొంది. దీని కోసం రూ.207 కోట్లను ఖర్చు చేసినట్లు సంస్థ వెల్లడింది.


సీపీడీసీఎల్‌ సీఎండీగా చక్రధర్‌బాబు

ఈనాడు, అమరావతి: కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీగా చక్రధర్‌బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ(ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎండీగా వ్యవహరిస్తున్న సంతోషరావును బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన ప్రస్తుతం ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీగా ఉన్నారు.


‘విశ్వంభర’ పురస్కారానికి శివశంకరి ఎంపిక

హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకమైన ‘విశ్వంభర’ డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షురాలు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. 


వివిధ నియామక పరీక్షల్లో ఎంపికయిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీల వెల్లడి 

ఈనాడు, అమరావతి: వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన వారికి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ అవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికచేసిన వారి జాబితానూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. శాంపిల్‌ టేకర్‌ (పుడ్‌ డిపార్టుమెంట్‌-వైద్య ఆరోగ్యశాఖ) ఉద్యోగ నియామకాలకు ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 12న ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్స్‌ ఉద్యోగాల నియామకాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.


28 నుంచి శాఖాపరమైన పరీక్షలు

ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షల నిర్వహణ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని