గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!

గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

Published : 05 Jul 2024 05:07 IST

రుణం మంజూరుపై ఎన్నికల ముందే చేతులెత్తేసిన నాబార్డు
ఆస్తుల తాకట్టుకు సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ అభ్యంతరం

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే రూ.258 కోట్లకు పైగా పనులు చేసిన గుత్తేదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రాజెక్టు వివరాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన ఇంజినీర్లు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిధులు నిలిచిపోయిన విషయాన్ని బయటపెట్టారు. రుణం కోసం నాబార్డుకు రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు అందులో వాటా ఉన్న సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ అంగీకరించలేదు. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిన రుణ ప్రతిపాదనలను నాబార్డు పక్కన పెట్టింది. తారురోడ్లలో గోతులు పూడ్చే ప్రాజెక్టును సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు గత వైకాపా ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇందుకోసం నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. 4,653 కిలోమీటర్ల పొడవైన 1,877 రోడ్లలో గోతులు పూడ్చేందుకు ఇంజినీర్లు రూ.1,121.85 కోట్లతో అంచనాలు తయారుచేసి ఏడాది క్రితమే టెండర్లు పిలిచారు. 233 ప్యాకేజీల్లో రూ.258.85 కోట్లతో 329 రోడ్ల పనులు పూర్తిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరో 96 ప్యాకేజీల్లో 1,548 రహదారుల పనులు ప్రారంభించే దశలో రుణం మంజూరుపై నాబార్డు చేతులెత్తేసింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు వచ్చే ఆదాయం హామీగా చూపించి నాబార్డు నుంచి రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణం తీసుకోవాలన్నది ప్రతిపాదన. ఆ ఆదాయం హామీగా సరిపోదని.. రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆస్తులనూ తనఖా పెట్టాలని నాబార్డు షరతు విధించింది. జగన్‌ ప్రభుత్వం ఇందుకు సిద్ధమైనా రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో కొంత వాటా కలిగిన సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ అభ్యంతరం తెలిపింది. దీంతో రుణం ఇవ్వలేమని నాబార్డు తేల్చిచెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని