మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Published : 05 Jul 2024 05:07 IST

రాష్ట్ర ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో కలసి అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గురువారం ఇక్కడి 50 అశోకరోడ్డు నివాసంలో నిర్వహించిన అల్లూరి జయంతి కార్యక్రమంలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా పార్లమెంటరీ పార్టీనాయకుడు లావుశ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరితోపాటు, తెదేపా ఎంపీలు అందరూ పాల్గొన్నారు. ‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజు సమసమాజ స్థాపనకు చూపిన బాట మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయం. తాడిత, పీడిత ప్రజలను, గిరిజనులను స్వాతంత్య్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది’ అని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.


మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ..

అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు

ఈనాడు డిజిటల్, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. బ్రిటీష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టడానికి మన్యంలో అల్లూరి చేసిన పోరాటం ఎందరో స్వాతంత్య్ర వీరులకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. 


అల్లూరి పోరాటాలు చిరస్మరణీయం: జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచిన విప్లవ వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి పోరాటాలు, త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. అల్లూరి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా’ అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గురువారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని