సంక్షిప్త వార్తలు (5)

అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఎహసానుల్లా మిషన్‌ కాంపౌండ్‌ సమీపంలోని బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి ఇంటి పెరట్లో పెంచిన అంజూర చెట్టు కాండం వద్దే కాయలు విరగ్గాసి ఆకర్షిస్తోంది.

Updated : 06 Jul 2024 04:47 IST

అదిరే.. అంజూర

అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఎహసానుల్లా మిషన్‌ కాంపౌండ్‌ సమీపంలోని బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి ఇంటి పెరట్లో పెంచిన అంజూర చెట్టు కాండం వద్దే కాయలు విరగ్గాసి ఆకర్షిస్తోంది. అంజూర అంటును నాటిన మూడేళ్లకు 5 నుంచి 6 కిలోల దిగుబడి ఇస్తుందని, తరువాత 10 నుంచి 15 కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన అధికారి సుకుమార్‌రెడ్డి చెప్పారు. చెట్టు మొదలు వద్దే భారీగా కాయలు కాయడం అరుదని తెలిపారు.

కలికిరి, న్యూస్‌టుడే. 


గిరిజన గురుకుల పాఠశాలలో సీట్లు ఇవ్వాలి

జీపీఎస్‌ అధ్యక్షుడు రాజునాయక్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: సుగాలి, ఎరుకల, యానాది సామాజికవర్గాల విద్యార్థినులకు గిరిజన గురుకుల పాఠశాలలో సీట్లు కేటాయించాలని గిరిజన సంక్షేమశాఖ సంయుక్త డైరెక్టర్‌ మల్లికార్జునరెడ్డిని గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌ కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నెరవాడ గురుకుల పాఠశాలలో 400 సీట్లు ఖాళీ ఉన్నాయని, వాటిలో అడ్మిషన్లు కల్పించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఆ శాఖ సంయుక్త డైరెక్టర్‌ను రాజునాయక్‌ శుక్రవారం కలిశారు. ‘నెరవాడ గురుకుల పాఠశాలలో కేవలం చెంచులకే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అయినప్పటికీ మరో 400 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మిగిలిన విద్యార్థినులకూ అవకాశం కల్పించాలి’ అని కోరారు. 


హైస్కూల్‌ ప్లస్‌లో బోధనకు ఎస్‌ఏల కేటాయింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 210 హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)ను కేటాయించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గత ప్రభుత్వం మండలానికో కో-ఎడ్యుకేషన్‌ కళాశాల, బాలికలకు ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. కో-ఎడ్యుకేషన్‌ కళాశాలల ఏర్పాటుకు ఎన్నికల ముందు ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభించారు. వీటిల్లో పాఠాలు చెప్పేందుకు గత ప్రభుత్వం అధ్యాపకులను నియమించలేదు. పోస్టులను మంజూరు చేయలేదు. దీంతో పాఠశాల విద్యాశాఖ స్కూల్‌ అసిస్టెంట్లను కేటాయించాలని కోరింది. ఆయా బడుల్లో ఉన్న వారిని సర్దుబాటు చేయాలని సూచించింది. 


టెట్‌లో పేపర్‌-1ఏ సిలబస్‌ మార్చాలి 

బైపీసీ అభ్యర్థుల వినతి

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో గణితం, సామాన్యశాస్త్రం అభ్యర్థులకు ఒకే సిలబస్‌ ఇవ్వడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పేపర్‌-1ఏ లో గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులు రాసే అభ్యర్థులకు పార్ట్‌-2లో గణితానికి 30 మార్కులు, భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి 15 మార్కులు, జీవశాస్త్రానికి 15 మార్కులు ఇచ్చారు. కానీ.. బైపీసీ చదివిన విద్యార్థులకు సైతం ఇదే విధానంలో సిలబస్‌ ఉంది. జీవశాస్త్రం సబ్జెక్టుకు పరీక్ష రాసేందుకు గణితం చదవకపోయినా 30 మార్కులకు ప్రశ్నలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టెట్‌లో తాము మార్కులు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైపీసీ అభ్యర్థులకు అసలు గణితంతో సంబంధం ఉండదు. పదో తరగతి వరకు చదివినా టెట్‌లో ఇంటర్మీడియట్‌ వరకు గణితం ఇస్తున్నారు. దీంతో పార్ట్‌-2లో బైపీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు. గణితం 30 మార్కులు స్కోర్‌ చేయలేకపోవడంతో మంచి మార్కులు రావడం లేదని, దీంతో డీఎస్సీలో ఇబ్బందులు పడుతున్నామని, సిలబస్‌ మార్చాలని కోరుతున్నారు. సాంఘికశాస్త్రం, భాషా సబ్జెక్టులకు వచ్చేసరికి 60 మార్కులకు అవే సబ్జెక్టులను ఇచ్చారు. 


విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్లు, చిక్కీలు నాణ్యతగా ఉండాలి: ఎస్పీడీ

ఈనాడు, అమరావతి: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే కోడిగుడ్లు, చిక్కీలు నాణ్యతగా ఉండాలని, చెడిపోయినవి ఇస్తే చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఎస్పీడీ) శ్రీనివాసరావు హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా గుడ్లు, చిక్కీలు అందించాలని అన్నారు. పెండింగ్‌ బిల్లులు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. సరఫరాలో నాణ్యత పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు