రూ.41 లక్షలు చెల్లించక.. నిలిచిన మందుల పంపిణీ!

వైకాపా ప్రభుత్వం నిధులు చెల్లించక పోవడంతో ప్రజాప్రతినిధులు, సచివాలయంలో పనిచేసే ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగులకు ఔషధాల పంపిణీ నిలిచిపోయింది.

Published : 06 Jul 2024 03:56 IST

ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఇతర అధికారులకు జనవరి నుంచి అందని ఔషధాలు
నాటి వైకాపా ప్రభుత్వ ఘనకార్య ఫలితం!

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం నిధులు చెల్లించక పోవడంతో ప్రజాప్రతినిధులు, సచివాలయంలో పనిచేసే ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగులకు ఔషధాల పంపిణీ నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇదే పరిస్థితి. మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులకు వైద్యుల సూచన మేరకు సచివాలయంలోని వైద్య విధాన పరిషత్‌ ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు ఇస్తారు. వైద్య ఆరోగ్య శాఖ పిలిచిన టెండరు ప్రకారం ఓ సంస్థ 2022 సెప్టెంబరులో 32.1% (ఎమ్మార్పీ ధరపై) రాయితీతో ఔషధాలు సరఫరా చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండరు గడువు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ క్రమంలో 2023 డిసెంబరులో సుమారు రూ.41 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఔషధాల పంపిణీని నిలిపేసింది. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, వారి సహాయకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంపై సభాపతి అయ్యన్నపాత్రుడు శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. ప్రస్తుత టెండరు విధానంలో మార్పులు చేసి, వ్యవస్థ పక్కాగా పని చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని