క్లస్టర్‌ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లపై కక్షసాధింపు

వైకాపా పెద్దలు చెప్పినట్లు వినలేదన్న కారణంతో కర్నూలులోని క్లస్టర్‌ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లపై గత ప్రభుత్వ హయాంలో ఉన్నతవిద్యాశాఖలోని కొందరు అధికారులు కక్ష కట్టారు.

Published : 06 Jul 2024 04:55 IST

చెప్పినట్లు వినలేదని జీతాల నిలిపివేత
వైకాపా పాలనలో ఉన్నత విద్యాశాఖాధికారుల అరాచకం

ఈనాడు, కర్నూలు: వైకాపా పెద్దలు చెప్పినట్లు వినలేదన్న కారణంతో కర్నూలులోని క్లస్టర్‌ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లపై గత ప్రభుత్వ హయాంలో ఉన్నతవిద్యాశాఖలోని కొందరు అధికారులు కక్ష కట్టారు. గతేడాది మే నెల నుంచి వారికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం.. వైకాపా పాలనలో తాము పడ్డ ఇబ్బందులను వీసీ, రిజిస్ట్రార్‌ ఉన్నత విద్యాశాఖాధికారులకు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జగన్నాథగట్టుపై క్లస్టర్‌ విశ్వవిద్యాలయానికి నూతన ప్రాంగణం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం రూ.88.50 కోట్లు కాగా.. అమాంతం రూ.139.50 కోట్లకు పెంచారు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఈడబ్ల్యూఐడీసీ) పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డీఈసీ సంస్థ పనులు చేపట్టింది. రుషికొండలో రాజమహళ్లను తలపించేలా భవనాలను ఈ సంస్థే నిర్మించింది. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంగణమైనప్పటికీ దాని అభివృద్ధిలో వీసీ, రిజిస్ట్రార్లకు ఎలాంటి ప్రమేయం లేకుండా చేశారు. దీంతోపాటు గుత్తేదారులకు చెల్లింపుల విషయంలోనూ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల పాత్ర లేకుండా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలను వీసీ, రిజిస్ట్రార్‌ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పొంతన లేని కారణాలు చూపి రిజిస్ట్రార్‌ను తొలగించేలా ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రార్‌ ఆచార్య డి.శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించి యథాతథ స్థితి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయా కారణాల నేపథ్యంలో ఒకటిన్నరేళ్లపాటు వీసీ, రిజిస్ట్రార్లకు, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు మధ్య అంతర్యుద్ధం జరిగింది. మరోవైపు రిజిస్ట్రార్‌ను మాతృసంస్థకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఆయన జీతాన్ని ఆపేయాలంటూ ఖజానా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారు రిజిస్ట్రార్‌ జీతంతోపాటు వీసీ జీతం సైతం ఆపేశారు. ఈ నేపథ్యంలో మానవహక్కుల కమిషన్‌కు వెళ్తామంటూ 4 నెలల క్రితం ఉన్నత విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. అయినా స్పందన లేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంతో తాము పడ్డ ఇబ్బందులను ఏకరవు పెట్టారు. 

పాలకమండలి సమావేశాలేవీ..

క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిపాలన, నూతన ప్రాంగణ నిర్మాణంలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలను ఎవరైనా ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు పాలకమండలి సమావేశాలను గత రెండేళ్లుగా నిర్వహించలేదు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం నిశిత పరిశీలన మొదలుపెట్టడంతో క్లస్టర్‌ విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణ నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగుచూస్తాయని పలువురు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని