గిరిజన విద్యార్థుల చేతికే కాస్మొటిక్‌ వస్తువులు

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు కాస్మొటిక్స్‌ ఛార్జీలను తల్లుల ఖాతాల్లోకి జమచేయకుండా.. ఆ నగదుతో వస్తువుల్ని కొనుగోలు చేసి వారికే అందించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

Published : 06 Jul 2024 04:56 IST

ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదానికి దస్త్రం

ఈనాడు, అమరావతి: గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు కాస్మొటిక్స్‌ ఛార్జీలను తల్లుల ఖాతాల్లోకి జమచేయకుండా.. ఆ నగదుతో వస్తువుల్ని కొనుగోలు చేసి వారికే అందించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. గత ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమచేస్తామని చెప్పి ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదు. ఎప్పుడూ నాలుగైదు నెలలు పెండింగ్‌ పెట్టింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కాస్మొటిక్‌ వస్తువుల్ని ప్రభుత్వమే విద్యార్థులకు సరఫరా చేసేలా గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి సీఎం చంద్రబాబు ఆమోదానికి పంపారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలోనూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కాస్మొటిక్స్‌ను విద్యార్థులకు ఇస్తే ఎలా ఉంటుందనేదానిపై అధికారులను ఆరాతీశారు.

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 548 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి కాస్మొటిక్‌ ఛార్జీల కింద నెలకు    రూ.1.5 కోట్లు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేస్తామని గత ప్రభుత్వం చెప్పినా, సక్రమంగా విడుదల చేయలేదు. గత డిసెంబరు నుంచి బకాయిపెట్టింది. దాదాపు రూ.10 కోట్ల మేర చెల్లించాలి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

జీసీసీ ద్వారా అందించేందుకు మొగ్గు

2014-19 మధ్య తెదేపా హయాంలో కాస్మొటిక్స్‌ను విద్యార్థుల చేతికే అందించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కిట్లు అందిస్తారు. వీటిలో పేస్ట్, బ్రష్, షాంపూ, కొబ్బరినూనె, సబ్బు, దువ్వెన, పౌడర్, తిలకం లాంటివిఇస్తారు. జిల్లాలవారీగా టెండర్లు పిలిచి ఆయా గుత్తేదారు సంస్థల ద్వారా సరఫరా చేయనున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా సరఫరా చేసే ఆలోచన కూడా ఉంది. అలా చేస్తే గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించినట్లు ఉంటుందనే ఆలోచనను అధికారులు చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఉత్పత్తులను విద్యార్థులకు అందిస్తారు. వైకాపా హయాంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు, అప్పటి మంత్రులు, గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు నివేదించినా జగన్‌ పట్టించుకోలేదు. పైగా ఎన్నికల ముందు తల్లులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సంయుక్త ఖాతాలు తెరిచి అందులో నగదు జమచేస్తామని ఆదేశాలిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు