వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని కోరుతూ నాలుగో నిందితుడైన షేక్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది.

Published : 06 Jul 2024 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని కోరుతూ నాలుగో నిందితుడైన షేక్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారినందున తనను నిందితుల జాబితా నుంచి తొలగించి, సాక్షిగా పరిగణించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ అప్రూవర్‌గా మారడానికి సీబీఐ కోర్టు అనుమతించదని, దీన్ని ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులు కూడా ఆమోదించాయన్నారు. సాక్షిగా మార్చడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. నిందితుల తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో దస్తగిరిని నిందితుడిగానే పేర్కొందన్నారు. ఆయన్ను అప్రూవర్‌గా అనుమతించడాన్ని సవాలు చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని, అవి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అందువల్ల దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు. నిందితుల్లో శివశంకర్, వైఎస్‌ భాస్కరరెడ్డి, దస్తగిరిలు హాజరుకాగా అవినాష్‌రెడ్డి హాజరు మినహాయింపు కోరడంతో న్యాయమూర్తి అనుమతించారు. జైలు నుంచి గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపర్చగా, వారి రిమాండ్‌ను ఈ నెల 18 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని