వాసుదేవరెడ్డి, కొడాలి నానిలపై పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహార శైలి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరుల బెదిరింపులతో నా తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 06 Jul 2024 05:09 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహార శైలి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరుల బెదిరింపులతో నా తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లిక్కర్‌ గోదామును నా తల్లి దుగ్గిరాల సీతామహాలక్ష్మి పేరున 2011లో రిజిస్టర్‌ టెండరులో పొందాం.  జగన్‌ ప్రభుత్వం వచ్చాక మా లీజు అగ్రిమెంటు పూర్తి కాకుండానే బెదిరించి గోదాము ఖాళీ చేయించారు. ఈ విషయంపై నా తల్లి వాసుదేవరెడ్డికి ఫోన్‌ చేస్తే ఆయన పరుష పదజాలంతో దూషించారు. ఆమె తీవ్ర వేదనకు గురయ్యారు. వైకాపా సానుభూతిపరుడు పద్మారెడ్డికి కట్టబెట్టేందుకే ఇదంతా చేశారు. దీంతో మనస్తాపం చెంది నా తల్లి సీతామహాలక్ష్మి చనిపోయారు. ఆమె మృతికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతారెడ్డి, పద్మారెడ్డి, వైకాపా నేతలు దుక్కిపాటి శశిభూషణ్, కసుకుర్తి జనార్దన్‌ అలియాస్‌ గుడ్లవల్లేరు బాబ్జీ, పాలడుగు రామ్‌ప్రసాద్‌ల బెదిరింపులే కారణం’’ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో గోదాముకు మెట్రో పాలిటన్‌ సిటీ రేటు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని