ద్వారంపూడి సంస్థకు షోకాజ్‌ నోటీసులివ్వండి

కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

Published : 06 Jul 2024 05:24 IST

పీసీబీ అధికారులకు పవన్‌ కల్యాణ్‌ ఆదేశం 

ఈనాడు డిజిటల్, అమరావతి: కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. ఆ సంస్థ వ్యర్థాల్ని పంట కాలువల్లోకి విడుదల చేయడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతోపాటు ఆ సంస్థకు సంబంధించిన పర్యావరణ ఉల్లంఘనలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమై.. వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ ఉల్లంఘనలపై ఆరా తీశారు. ‘కరప మండలం గురజనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ నుంచి వ్యర్థ జలాల్ని శుద్ధి చేయకుండానే పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. అనుమతుల ప్రకారం రోజుకు 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 56 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఎఫ్ల్యుయంట్‌ ట్రీట్‌మెంట్‌ ట్యాంకులు లేవు. అక్కడ ప్లాంట్‌ పనిచేయాలంటే మరో 11 ఎకరాలు అవసరం. కానీ తక్కువ విస్తీర్ణంలో సంస్థను నడిపిస్తున్నారు. పర్యావరణ నిబంధనలు పాటించకుండా రొయ్యల వ్యర్థాల్ని పారవేస్తున్నారు. రొయ్యల వలిచే ప్రక్రియలోనూ నిబంధనలు పాటించట్లేదు. పరిసర గ్రామాల్లో చిన్నచిన్న యూనిట్ల ద్వారా రొయ్యలు ఒలిపించి ఆ వ్యర్థాల్ని అక్కడే పారవేస్తున్నారు. దీని వల్ల కాలుష్యం పెరగడంతో పాటు, గ్రామాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి’ అని పీసీబీ అధికారులు పవన్‌ కల్యాణ్‌కు నివేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని