తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం

తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.

Published : 06 Jul 2024 05:28 IST

పర్యాటక హోటల్‌ ప్రారంభంలో మంత్రి దుర్గేశ్‌

హోటల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కందుల దుర్గేశ్‌. చిత్రంలో తితిదే ఈవో జె.శ్యామలరావు,
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నేత హరిప్రసాద్‌ తదితరులు

తిరుపతి(నగరం), తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం నారాయణగిరిలోని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవరాగం హోటల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆహార నాణ్యత కోసం ప్రైవేటు వ్యక్తుల సహకారం తీసుకుంటాం. ఏపీ టూరిజం చేయించే దర్శనాలు త్వరగా జరిగేలా చర్యలు చేపడతాం. తిరుపతిలో ఉన్న 30 ఎకరాల పర్యాటక స్థలంలో అభివృద్ధి పనులు చేస్తా. కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో తితిదే ఈవో జె.శ్యామలరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకుడు హరిప్రసాద్‌ పాల్గొన్నారు. 

రుషికొండ ప్యాలెస్‌పై త్వరలో నిర్ణయం 

విశాఖ రుషికొండపై రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్యాలెస్‌ కట్టించుకున్న జగన్‌.. అధికారం పోయాక ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ విమర్శించారు. ఆ ప్యాలెస్‌పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో పర్యాటక మంత్రిగా వ్యవహరించిన రోజా కేవలం పవన్‌కల్యాణ్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో పర్యాటక రంగానికి పైసా కూడా కేటాయించలేదు. తిరుపతిలోని అలిపిరి వద్ద 20 ఎకరాలు ఒబెరాయ్‌ సంస్థకు, మరో పది ఎకరాలు దేవ్‌లోక్‌ ప్రాజెక్టుకు భూములు కట్టబెట్టారే కానీ, అక్కడ ఒక్క పనీ ప్రారంభించలేదు. ఈ భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మించాలని నిర్మాతలను కోరుతున్నాం. సినిమా రంగానికి ప్రత్యేక విధానం తీసుకొస్తాం’ అని మంత్రి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని