సంక్షిప్త వార్తలు (5)

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.రవీంద్రబాబు దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు.

Updated : 07 Jul 2024 06:35 IST

మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఆలయం వద్ద జస్టిస్‌ రవీంద్రబాబు దంపతులు 

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.రవీంద్రబాబు దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీశైలం వచ్చిన న్యాయమూర్తికి దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదాశీర్వచనాలు, ఈఓ.. స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


జలవనరుల శాఖ ఈఎన్‌సీగా కె.శ్రీనివాస్‌ నియామకం

ఈనాడు డిజిటల్, అమరావతి: జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ-పరిపాలన)గా కె.శ్రీనివాస్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న సతీష్‌కుమార్‌ పదవీకాలం గత నెల 30న ముగియడంతో ఆయన స్థానంలో కె.శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. 


‘బీసీలపై దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా హయాంలో బీసీలపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీని శనివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు.


బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌

తెదేపా నేతల నివాళి

జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు

ఈనాడు డిజిటల్, అమరావతి: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వానికి జీవితాన్ని అంకితం చేసిన ప్రజల నేత, స్వాతంత్య్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని తెదేపా నేతలు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ‘హరిత విప్లవం, వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో జగ్జీవన్‌రామ్‌ అందించిన సహకారం అనితర సాధ్యం. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


జగ్జీవన్‌రామ్‌ జీవితం ఆదర్శప్రాయం: మాజీ ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శనివారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని