డీ అడిక్షన్‌ సెంటర్లను పటిష్ఠం చేయాలి

గంజాయి, డ్రగ్స్‌ కట్టడికి యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 07 Jul 2024 05:07 IST

వైకాపా హయాంలో ఏడాదిగా నిలిచిన వేతనాలు
225 పోస్టులకు 96 ఖాళీ

ఈనాడు, అమరావతి: గంజాయి, డ్రగ్స్‌ కట్టడికి యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో డీ అడిక్షన్‌ సెంటర్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. వైకాపా పాలనలో ఈ వ్యవస్థ పూర్తిగా    నిర్వీర్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 కేంద్రాల్లో ఒకటి, రెండు మినహా మిగిలినవాటి పనితీరు అధ్వానంగా ఉంది. ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా సైకియాట్రిస్ట్, ఇద్దరు నర్సులు, ఇద్దరు వార్డు బాయ్స్, ముగ్గురు కౌన్సెలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉండాలి. ప్రస్తుతం 14 మంది వైద్యులు, 12 మంది నర్సులు, 24 మంది వార్డు బాయ్స్, 38 మంది కౌన్సెలర్లు, 8 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారికి ఏడాదిగా వేతనాలు చెల్లించడం లేదు.

కానరాని పర్యవేక్షణ..

నాణ్యత లేని మద్యం విక్రయాలు సాగించి పేదల బతుకులను రోడ్డున పడేసిన వైకాపా ప్రభుత్వం.. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించలేదు. దీంతో వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యసనాల ద్వారా వచ్చే ఆరోగ్య, సామాజిక సమస్యలపై బాధితులకు అవగాహన కల్పించాల్సిన డీ అడిక్షన్‌ సెంటర్లు అలంకారప్రాయంగా మారాయి. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, ఏలూరు, ఒంగోలు, మదనపల్లె, అనకాపల్లి, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు, నరసాపురం ఆసుపత్రుల్లోని కేంద్రాల్లో వైద్యులు లేరు. కొన్నిచోట్ల ఇతరులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అసలు ఈ కేంద్రాలకు బాధితులు ఎవరెవరు వస్తున్నారు? వారికి ఎలాంటి చికిత్స అందించాలి? ఎంతమంది ఇన్‌పేషెంట్లు ఉన్నారనే అంశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్డీయే ప్రభుత్వంలోనైనా ఖాళీ పోస్టులను భర్తీచేయడంతో పాటు వీటి పనితీరును మెరుగుపర్చాలి. గంజాయి, మాదకద్రవ్యాల ప్రభావిత ప్రాంతాల్లో అదనంగా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటుచేయాలి.

రూ.22 కోట్లు కేంద్రం నుంచి వచ్చినా..

ఈ కేంద్రాల్లో పనిచేసే వారి వేతనాల కోసం గతంలో కేంద్రప్రభుత్వం నుంచి రూ.22 కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చాయి. సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో వాటిని వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఈ నిధుల కోసం అధికారులు మళ్లీ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని