ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్‌ఎంసీ నిరాకరణ

వైకాపా ప్రభుత్వ పాపాలు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రావడంపై ప్రభావం చూపాయి.

Published : 07 Jul 2024 05:07 IST

- వైకాపా ప్రభుత్వ ప్రణాళిక లోపం ఫలితం 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ పాపాలు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రావడంపై ప్రభావం చూపాయి. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె కళాశాలల్లో 2024-25 ఏడాదికి ప్రవేశాల నిర్వహణకు అనుమతులు (లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌) ఇచ్చేందుకు 2 రోజుల క్రితం ఎన్‌ఎంసీ ప్రాథమిక స్థాయిలో నిరాకరించింది. గతేడాది ఆగస్టులో ప్రతి కళాశాలలోనూ ఎంబీబీఎస్‌లో 100 సీట్ల చొప్పున భర్తీకి అనుమతులు కోరుతూ వైకాపా ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ మేరకు ఇటీవల ఎన్‌ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు చేశాయి. అన్నిచోట్లా బోధకుల కొరత ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారానే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ జరుగుతుంది. దీనిగురించి ఆలోచించకుండా వైకాపా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో బోధకుల కొరతను అధిగమించలేని పరిస్థితులు తలెత్తాయి. మరోవంక..విద్యార్థినీవిద్యార్థుల హాస్టళ్ల భవన నిర్మాణాలు, లెక్చర్‌ థియేటర్, ఎగ్జామినేషన్‌ హాళ్ల వంటివి సిద్ధం కాకపోవడాన్నీ తనిఖీ బృందాలు ప్రశ్నించాయి. 

చెల్లింపులు చేయకపోవడం వల్లే..: గత ఏడాది జులై నుంచి నిర్మాణాలకు తగ్గట్లు సంబంధిత సంస్థలకు వైకాపా ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు. ఈ కారణంగా పనులు మందకొడిగా సాగాయి. తనిఖీల అనంతరం వర్చువల్‌ విధానంలో రాష్ట్ర అధికారుల నుంచి ఎన్‌ఎంసీ వివరణ కోరింది. గుర్తించిన లోపాలను ప్రవేశాల నాటికి సరిదిద్దుతామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా ఎన్‌ఎంసీ సంతృప్తి చెందలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ స్థాయిలో కేంద్రంతో సంప్రదింపులు జరిపితే ఎన్‌ఎంసీ నుంచి ప్రవేశాలకు అవసరమైన అనుమతులు లభించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారమైతే... 2025-26లో ప్రారంభం కావాల్సిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలలకూ అనుమతుల సాధన కష్టమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని