దాతలు ఇచ్చే ఆస్తులను సంరక్షించుకోవాలి

దాతలు విరాళంగా ఇచ్చే ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Updated : 07 Jul 2024 06:15 IST

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌. చిత్రంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు

పెనమలూరు, న్యూస్‌టుడే: దాతలు విరాళంగా ఇచ్చే ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధి యనమలకుదురులో.. ఆ గ్రామానికి చెందిన దాత, వెలగపూడి ట్రస్టు అధ్యక్షురాలు వెలగపూడి విజయలక్ష్మి తన భర్త ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం రూ.4.50 కోట్ల విరాళంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన వైద్యపరికరాలు, సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఏపీ ధార్మిక పరిషత్‌ సభ్యులు, దాత సంగా నరసింహారావు, వెలగపూడి ట్రస్టు అధ్యక్షురాలు వెలగపూడి విజయలక్ష్మి, కుమారుడు రాజకుమార్, వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పబ్లిక్‌హెల్త్‌ డైరెక్టర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

వ్యసన రహిత జీవనశైలిని అలవర్చుకోండి 

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరాను కూకటివేళ్లతో పెకలిస్తామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇస్కాన్‌ విజయవాడ, ఎర్త్‌ హీరోస్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘వ్యసన వ్యతిరేక వాకథాన్‌-2024’ను ఇస్కాన్‌ అధ్యక్షుడు చక్రధారిదాస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వ్యసన రహిత, ఆరోగ్యకర జీవనశైలిని పాటించడం ద్వారా ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ‘సమాజంతో కలిసి వ్యసనాన్ని ఎదుర్కొందాం.. దురలవాట్ల బారిన పడకుండా ఉందాం’ అని వాకథాన్‌లో పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎర్త్‌ హీరోస్‌ ఫౌండేషన్, ఇస్కాన్‌ ప్రతినిధులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. ఈ వాకథాన్‌ ఐజీఎంసీ స్టేడియం వద్ద ప్రారంభమై తిరిగి స్టేడియం వద్దకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని