బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం

మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్‌ రాజమహల్‌ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు.

Published : 07 Jul 2024 06:08 IST

విశాఖలో ప్రత్యేక వసతులతో భవనం నవీకరణ!
తాత్కాలిక వసతులకు భారీగా ఖర్చు చేసిన వీఎంఆర్‌డీఏ

ఈనాడు, విశాఖపట్నం : మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్‌ రాజమహల్‌ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. జగన్‌ ఒకటనుకుంటే...జనమొకటి నిర్ణయించి ఆయన్ను ఇంటికి పంపించేశారు. వైకాపా అధికారంలో ఉండగా... జగన్‌ పంథానే కొందరు అధికారులూ అనుసరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో పని చేసిన ఓ కీలక అధికారిణి విశాఖలో ప్రత్యేక బంగ్లా సిద్ధం చేయించుకున్నారు. అవసరం లేకపోయినా సుమారు రూ.60 లక్షలతో ఆధునికీకరించుకున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌కు పాండురంగాపురంలో కేటాయించిన బంగ్లా సుమారు రెండేళ్లుగా ఖాళీ ఉంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం విశాఖ నుంచే పాలనంటూ ఊదరగొట్టడంతో ఆ కీలక అధికారిణి ఈ భవనాన్ని నివాసం కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు ఆఘమేఘాల మీద అంచనాలు రూపొందించి భవనం అంతటికీ సొబగులు అద్దారు.

అత్యుత్సాహం ప్రదర్శించిన వీఎంఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం ఆ బంగ్లాను మినీ ప్యాలెస్‌గా మార్చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికారులు పనులు ఆపలేదు. లోపల ఖరీదైన విద్యుత్తు దీపాలు, పదుల సంఖ్యలో ఏసీలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తుకూ లిఫ్టు సౌకర్యం కల్పించారు. అన్ని గదుల్లో పాత సీలింగు తొలగించి కొత్తగా నిర్మించారు. ఖరీదైన ఫర్నీచర్‌తో సుందరీకరణ పనులు చేపట్టారు. సదరు అధికారిణి అభిరుచికి తగ్గట్లు పచ్చికలో ప్రత్యేకంగా రెల్లిగడ్డితో అందమైన చిన్నచిన్న గుడిసెలు నిర్మించారు. భవనం లోపల, బయట అనేక రకాల పనులకు రూ.60 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. కేవలం అధికారిణిని మెప్పించేందుకు పనులు చేసి.. ఇప్పుడు ‘కమిషనర్‌ బంగ్లా ఆధునికీకరణ’ అంటూ అధికారులు చేతులు దులుపుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని