దేశ ఆర్థికవ్యవస్థలో సీఏల పాత్ర కీలకం

దేశ ఆరోగ్యానికి వైద్యులు ఎంత కీలకమో దేశ సంపదకు ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ (సీఏ)లు అంతే కీలకమని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Updated : 08 Jul 2024 06:18 IST

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: దేశ ఆరోగ్యానికి వైద్యులు ఎంత కీలకమో దేశ సంపదకు ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ (సీఏ)లు అంతే కీలకమని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. దేశ ఆర్థిక పారదర్శకతకు సంరక్షకులుగా సీఏలు వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవాన్ని ఆదివారం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సీఏల సంతకం కేవలం ఒక్క కంపెనీ మేనేజ్‌మెంట్‌పైనే కాకుండా వేలమంది ఉద్యోగులు, షేర్‌ హోల్డర్స్‌తోపాటు దేశ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసే సీఏలు తమ వృత్తి విలువలను విస్మరించొద్దని సూచించారు. మనం ఏ వృత్తిలో ఉన్నా నిత్యవిద్యార్థిగా ఉండాలన్నారు. తమ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ప్రతి ఆదివారం కనీసం రెండు గంటలు తమ వృత్తి పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కేటాయించాలని సూచించారు. తాను అలా చేయడం వల్లే వైద్యుడిగా జీవితం ప్రారంభించి.. అమెరికాలో సక్సెస్‌ఫుల్‌ ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగినట్లు తెలిపారు. తెలుగు మాధ్యమంలో చదివిన తాను ఈ స్థాయికి రావడానికి కష్టపడేతత్వమే కారణమని చెప్పారు. ఇతరులు సృష్టించిన మార్గాన్ని అనుసరిస్తూ నడవటం కాదు, మనకు మనం కొత్త మార్గాలను సృష్టించుకొని జీవిత లక్ష్యాలను ఛేదించేందుకు శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాల శ్రీధర్, దయానివాస్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని