సంక్షిప్త వార్తలు (8)

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ ఆదివారం దర్శించుకున్నారు.

Updated : 08 Jul 2024 09:30 IST

అహోబిలంలో టీవీఎస్‌ సంస్థ ఛైర్మన్‌ పూజలు

ఆలయ పీఠాధిపతితో వేణు శ్రీనివాసన్‌ 

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ ఆదివారం దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో దిగువ అహోబిలం చేరుకున్న ఆయన మఠంలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం పీఠాధిపతితో కలిసి ఆలయం అష్టదిగ్బంధన మహాసంప్రోక్షణలో పాల్గొన్నారు. యాగశాలలో నిర్వహించిన మహాపూర్ణాహుతిని తిలకించారు. తర్వాత అర్చకులు ఆయనను అతిథి మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.


సీతా‘సోకు’ చిలుకలు

అరుదైన పశుపక్ష్యాదులతోపాటు కీటకాలకు నిలయం శేషాచలం కొండలు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వివిధ రకాల సీతాకోకచిలుకలు గుంపులుగా వాలి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమల శ్రీవారి దర్శనార్థం కనుమ దారిలో ఆకులను తలపిస్తూ మొక్కలపై వాలి ఇవి కనువిందు చేస్తున్నాయి.

ఈనాడు, తిరుపతి


‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ప్రైవేటీకరణ ఆపాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని అమెరికాలోని తెలుగు ప్రజలు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. టెక్సాస్‌లోని జఫర్‌సన్‌ పార్కులో ప్రవాసాంధ్రులు శ్రీనివాసరావు, సురేష్‌ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండు చేశారు. 


రైతు భరోసా కేంద్రాల పేరు ‘రైతు సేవా కేంద్రాలు’గా మార్పు 

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మారుస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


‘ఐబీ, టోఫెల్‌ విధానాల్ని ఉపసంహరించాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల విద్యలో సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్‌ విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని పునరుద్ధరించి, పాఠ్యపుస్తకాలను ఒకే భాషలో ముద్రించాలని సంఘ రాష్ట్రాధ్యక్షుడు పి.వెంకటరమణ కోరారు. ఆదివారం విజయవాడలో వారు సమావేశమై ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు. నిర్మాణ పనుల నుంచి ప్రధానోపాధ్యాయుల్ని తప్పించాలని అన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు శ్రీనివాసరావు, సీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.


ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది. అన్ని కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 31 తుది గడువని బోర్డు కార్యదర్శి నిధిమీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.


చంద్రబాబును కలిసిన ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ 

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో తెదేపా మీడియా కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోనుందని పేర్కొన్నారు.


నేటి నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ఈసారి బీటెక్‌ సీట్లు తగ్గాయి. వెబ్‌ ఆప్షన్లు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా కన్వీనర్‌ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు 173 ఉండగా... వాటిల్లో మొత్తం సీట్లు 98,296. ప్రైవేట్‌ కళాశాలల్లోని సీట్లలో 70 శాతాన్ని కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆ ప్రకారం ఈసారి 70,307 సీట్లకు విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని