జోగి రమేశ్‌.. మా భూమిని కాజేస్తున్నారు

మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి కలిసి తమ 70 ఎకరాల భూమిని నకిలీపత్రాలతో కాజేసేందుకు యత్నిస్తున్నారని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు ఆరోపించారు.

Published : 09 Jul 2024 03:58 IST

70 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చూస్తున్నారు
రెవెన్యూ మంత్రి కార్యాలయంలో.. బాధితుడు రంగబాబు ఫిర్యాదు  

జోగి రమేశ్‌ కుట్ర చేస్తున్నారని ప్లకార్డులతో సచివాలయం గేటు వద్ద నిరసన తెలుపుతున్న రంగబాబు

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి కలిసి తమ 70 ఎకరాల భూమిని నకిలీపత్రాలతో కాజేసేందుకు యత్నిస్తున్నారని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు ఆరోపించారు. బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాస్‌ సహకారంతో ఈ వ్యవహారం జరుగుతోందని చెప్పారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ పాత్రపైనా అనుమానం ఉందని ఆరోపించారు. ఆయనకు ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రేషన్‌ అయ్యాక చూద్దామంటూ చాలా తేలిగ్గా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగబాబు విలేకర్లతో మాట్లాడారు. త్వరలో సబ్‌రిజిస్ట్రార్ల బదిలీలు ఉన్నాయని తెలిసి.. ఆలోపే తమ భూముల్ని నకిలీ పత్రాల ఆధారంగా వేరేవారికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాస్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జోగి రమేశ్‌ బారి నుంచి తమ భూముల్ని కాపాడాలని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు.

జోగి రమేశ్‌ రూ.15 లక్షలు వసూలు చేశారు..

‘మా అమ్మకు వైద్యం కోసం గతంలో మా ఉమ్మడి ఆస్తి కొంత విక్రయించాను. కొనుగోలుదారులకు ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేయించేలోపే జోగి రమేశ్, ఆయన ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి మా మొత్తం భూమిని వివాదాస్పద భూముల (డిస్ప్యూట్‌ ల్యాండ్స్‌) జాబితాలో పెట్టించేశారు. ఆ తర్వాత వారిద్దరూ నా దగ్గర నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. ఇప్పుడేమో మా కుటుంబానికి సంబంధించిన 30 ఎకరాలు, మా చిన్నతాత కుటుంబానికి సంబంధించిన 40 ఎకరాల భూమిని నకిలీపత్రాలతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై బంటుమిల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాస్‌కు ఫిర్యాదిస్తే ఆయన మా దగ్గర వివరాలన్నీ తీసుకుని శ్రీనివాసరెడ్డికి చేరవేశారు. శ్రీనివాసరెడ్డి మమ్మల్ని బెదిరించి, మాపైన అక్రమ కేసులు పెట్టారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని బాధితుడు రంగబాబు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని