సంక్షిప్త వార్తలు (7)

దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా కోట్ల ఉదయనాథ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ఉదయనాథ్‌..

Updated : 09 Jul 2024 06:35 IST

ద.మ.రైల్వే డిప్యూటీ జీఎంగా ఉదయనాథ్‌

సికింద్రాబాద్, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా కోట్ల ఉదయనాథ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ఉదయనాథ్‌.. గతంలో సికింద్రాబాద్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కన్‌స్టక్ష్రన్‌ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్, చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ద.మ.రైల్వేలో డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా, సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.


అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలు: హోంమంత్రి వంగలపూడి అనిత

ఈనాడు-అమరావతి: అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాల కొనుగోలు, ఇతర వసతుల కల్పన కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. దీని కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగించుకోవాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆమె అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖకు సంబంధించిన సమస్యలు, తక్షణ అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, అగ్నిమాపక శాఖ డీజీ శంఖబ్రత బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.


సచివాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి డోలా

ఈనాడు, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్‌ ప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రాలు అందించారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, పింఛను మంజూరు చేయాలని విశాఖ జిల్లా గాజువాకకు చెందిన యువకుడు మంత్రిని కోరారు. త్వరలోనే పింఛను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు.. ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ఉత్తర్వులు

కడప (విద్య), న్యూస్‌టుడే: పాఠశాల విద్య కడప ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయనపై నమోదైన అవినీతి, అక్రమాల అభియోగాలపై విచారణ, క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇన్‌ఛార్జి ఆర్జేడీగా కర్నూలు డీఈవో శామ్యూల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాఘవరెడ్డి వైకాపా ప్రభుత్వ హయాంలో నేతలతో అంటకాగుతూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.


కొడాలి నానిపై కేసులో.. 41ఏ నోటీసు నిబంధన పాటించండి 

ఈనాడు, అమరావతి: మాజీమంత్రి, వైకాపా నేత కొడాలి నాని, మరికొందరిపై గుడివాడ ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల సమయంలో తమను బలవంతంగా రాజీనామా చేయించారంటూ వార్డు వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాని, మరికొందరిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసును కొట్టేయాలంటూ నాని, తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.


కృష్ణపట్నం పోర్టును సందర్శించిన బంగ్లాదేశ్‌ బృందం 

బంగ్లాదేశ్‌ బృంద సభ్యులతో పోర్టు ప్రతినిధులు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: ఇరుదేశాల మధ్య సముద్ర సహకారం, వాణిజ్య అవకాశాలు, తీర ప్రాంత షిప్పింగ్‌ ఒప్పందంలో భాగంగా 13 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్‌ ప్రతినిధుల బృందం సోమవారం అదానీ కృష్ణపట్నం పోర్టును సందర్శించింది. పోర్టు సాంకేతిక కార్యకలాపాలు, సమగ్ర మౌలిక సదుపాయాలు, పోర్టు సామర్థ్యం, పరస్పర సముద్ర వాణిజ్య అవకాశాల పెంపు తదితర అంశాలను పరిశీలించింది ఈ బృందం త్వరలో విశాఖ, హల్దీయా, కోల్‌కతాలోని ఓడరేవులనూ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. 


‘ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి’

ఈనాడు, అమరావతి: సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు మే, జూన్‌ నెల జీతాలు చెల్లించాలని కోరుతూ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(అప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్‌రావు లేఖ రాశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని