ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించొద్దు

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని, ఈ వ్యవహారంపై నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 09 Jul 2024 04:08 IST

ఈసీకి హైకోర్టు ఆదేశం 
అనర్హతపై జంగా కృష్ణమూర్తి పిటిషన్‌ 

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని, ఈ వ్యవహారంపై నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. శాసన మండలి కార్యదర్శి, ట్రైబ్యునల్‌ హోదాలో మండలి ఛైర్మన్, వైకాపా విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 

  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో శాసన మండలిలో వైకాపా విప్‌ అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటిస్తూ మండలి ఛైర్మన్‌ జూన్‌ 15న ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాలు చేస్తూ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదిస్తూ.. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా, పిటిషనర్‌ వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అనర్హుడిగా ప్రకటించారన్నారు. ఈసీ తరఫు న్యాయవాది సత్య శివదర్శిన్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ పదవీకాలం ఏడాది మాత్రమే ఉన్నందున ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన వర్తించదన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఈసీని ఆదేశించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని