కౌంటర్‌ వేసేంత వరకైనా.. పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించండి

పోలీసు భద్రత కల్పించాలని వైకాపా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసుకున్న వినతి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) వద్ద పెండింగులో ఉందని, ఈ వ్యాజ్యంపై పోలీసులు కౌంటర్‌ వేయాల్సి ఉందని హైకోర్టు గుర్తుచేసింది.

Published : 09 Jul 2024 04:09 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: పోలీసు భద్రత కల్పించాలని వైకాపా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసుకున్న వినతి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) వద్ద పెండింగులో ఉందని, ఈ వ్యాజ్యంపై పోలీసులు కౌంటర్‌ వేయాల్సి ఉందని హైకోర్టు గుర్తుచేసింది. ఈలోపు పెద్దిరెడ్డికి ఏమైనా జరిగితే కోర్టును నిందించే అవకాశం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌సీ నిర్ణయం తీసుకునేంత వరకు, పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసేంత వరకు.. కనీసం మూడు వారాలు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు     జారీ చేశారు. తనకు గతంలో కల్పించిన 5+5 పోలీసు భద్రతను ప్రస్తుతం కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెద్దిరెడ్డి   రామచంద్రారెడ్డి, తనకు 4+4 భద్రత కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ రాజంపేట వైకాపా ఎంపీ  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

పెద్దిరెడ్డి స్థలంలో నిర్మాణంపై తొందరపాటు చర్యలొద్దు

తిరుపతి, ఎంఆర్‌ పల్లి, వార్డు నంబరు 23 పరిధిలోని తమకు చెందిన 4.82 ఎకరాల్లో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు సోమవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. భద్రత నిమిత్తం అప్పట్లో ఏర్పాటు చేసిన కాంక్రీటు రహదారి విషయంలో చర్యలు చేపట్టకుండా అడ్డుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఈ వ్యాజ్యంపై విచారణ నిర్వహించారు. తొందరపాటు చర్యలు వద్దని తిరుపతి మున్సిపల్‌  కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు సమర్పించాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ... తమ భూముల్లో నిర్మించిన రహదారి ఖర్చులను తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెల్లించేందుకు పిటిషనర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. రహదారి, గేటు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు