పాల్వాయిగేటుకు నేను వెళ్లనే లేదు

‘పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రానికి నేను వెళ్లలేదు. ఈవీఎంను పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు.

Updated : 09 Jul 2024 10:03 IST

ఈవీఎంను పగలగొట్టలేదు 
నంబూరి శేషగిరిరావు ఎవరో తెలియదు 
తొలిరోజు విచారణలో పోలీసులకు సహకరించని పిన్నెల్లి  

ఈనాడు, నెల్లూరు- ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రానికి నేను వెళ్లలేదు. ఈవీఎంను పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు. ఆరోజు నా వెంట గన్‌మన్లు లేరు’... పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలివి. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదైన సంగతి విదితమే. మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేశారు. ఈ ఉదంతంపై మరోకేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జైలులో ఉన్న రామకృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.

జైలు అధికారులు లోపలికి అనుమతించక పోవడంతో బయట వేచి ఉన్న మాచర్ల పోలీసులు

 సహకరించని జైలు అధికారులు

సోమవారం ఉదయం 10 గంటలకే డీఎస్పీతోపాటు 11 మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఏడుగురినే జైలు లోపలికి అనుమతించారు. వీరిలో రెంటచింతల ఎస్‌ఐ ఎం.ఆంజనేయులు, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక కెమెరామన్, ఇద్దరు మధ్యవర్తులున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన విచారణ.. రాత్రి ఏడు గంటల వరకు సాగింది. పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగ్గా.. దాదాపు 30 ప్రశ్నలకు పైగా నేను వెళ్లలేదు.. వారెవరో నాకు తెలియదు.. అనే సమాధానాలు చెప్పినట్లు సమాచారం. కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి  నేడు పిన్నెల్లిని విచారించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని