ఇసుక అక్రమార్కులకు రూ.లక్ష వరకు జరిమానా

ఇప్పటి వరకు ఉన్న ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు వెలువరింది. ఇసుక అక్రమంగా తవ్వినా, తరలించినా, పరిధి దాటి తవ్వినా, నిర్మాణ అవసరాలకు మించి అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా క్రిమినల్‌ కేసులు పెడతామని,

Updated : 09 Jul 2024 06:30 IST

ఈనాడు - అమరావతి

ప్పటి వరకు ఉన్న ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు వెలువరింది. ఇసుక అక్రమంగా తవ్వినా, తరలించినా, పరిధి దాటి తవ్వినా, నిర్మాణ అవసరాలకు మించి అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా క్రిమినల్‌ కేసులు పెడతామని, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఇతర రాష్ట్రాలకు తరలించడం, ఇతర అవసరాలకు ఇసుక వినియోగించడం నిషేధమని పేర్కొంది. ఉత్తర్వులోని కీలకాంశాలివీ..  

 • అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా వంటివి జరగకుండా నియంత్రించేందుకు కలెక్టర్‌ జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ బృందం తరచూ నిల్వ కేంద్రాలు, రీచ్‌లు పరిశీలిస్తుంది. ఇందులో ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ) కీలకంగా వ్యవహరిస్తుంది. అంతర్‌రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు.
 • డివిజనల్‌ స్థాయిల్లో కూడా విజిలెన్స్, మానిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తారు.
 • వేబిల్లులు లేకుండా ఇసుక తరలించినా, ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేసినా, తాగునీటి పథకాలకు, వంతెనలు, జలాశయాలు, రైల్వే లైన్లకు 500 మీటర్లలోపు ఇసుక తవ్వితే జరిమానాలు విధిస్తారు.
 • ఎడ్లబండ్ల ద్వారా ఇసుక విక్రయిస్తే తొలిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.3 వేలు, తర్వాత మళ్లీ సీజ్‌ చేస్తే రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తారు.
 • వేబిల్లులో ఉన్న పరిమాణం కంటే ఎక్కువ ఇసుక రవాణా చేస్తే.. అదనంగా ఉన్న ప్రతి  టన్నుకు రూ.2 వేల చొప్పున జరిమానా వేస్తారు.
 • గుర్తించిన లీజుల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో ఇసుక తవ్వితే.. టన్నుకు రూ.2 వేల చొప్పున గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తే రెండేళ్ల జైలు

 • అవసరానికి మించి ఇసుక నిల్వ చేసినా, బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించినా.. రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. జిల్లా కమిటీ ఆ ఇసుకను స్వాధీనం చేసుకొని, విక్రయించాలి.
 • ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వాహనాలను సీజ్‌ చేయడం, జరిమానాలు విధించడం వంటి అధికారాలు.. కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సబ్‌ కలెక్టర్‌/ఆర్డీవో, తహసీల్దార్, జిల్లా గనులశాఖ అధికారి, జిల్లా, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, ఎస్‌ఈబీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీలకు కల్పించారు.
 • అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాచేసే యంత్రాలు, వాహనాలను సీజ్‌చేసి, దాని యజమానిపై కేసు నమోదుచేసి కోర్టులో వివరాలు అందజేయాలి. వాహన యజమానికి తాఖీదు జారీ చేసి, వివరణ తీసుకోవాలి. తర్వాత వాహనం విడుదల చేయాలని దరఖాస్తుచేస్తే.. సెక్యూరిటీగా ఆ వాహనం, యంత్రం బట్టి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు డీడీ రూపంలో తీసుకొని విడుదల చేయాలి.

జిల్లా, రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నంబరు

 • ఇసుకపై ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో జిల్లా ఇసుక కమిటీలు, రాష్ట్ర స్థాయిలో గనులశాఖ సంచాలకుని ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ నంబరు, మెయిల్‌ ఐడీలు ఇవ్వాలి. వీటికి వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలి.
 • ఇసుక ఆపరేషన్స్‌లో గనులశాఖ, నీరు నేల చెట్టు చట్టం (వాల్టా) నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు పాటించేలా జిల్లా కమిటీ చర్యలు తీసుకోవాలి.

పూడిక ఇసుక తవ్వకాలకు ప్రణాళిక

 • రాష్ట్రంలో వివిధ జలాశయాలు, బ్యారేజీలు, పెద్దచెరువుల్లో పూడిక రూపంలో ఉన్న ఇసుక తవ్వకాలకు వీలుగా జలవనరులశాఖ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (ఈఎంపీ) సిద్ధం చేయాలి.
 • వీటి కోసం కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో)కి దరఖాస్తు చేసి, అనుమతులు పొందాలి.
 • బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా పూడిక ఇసుక తవ్వి తీయాలి.
 • ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్‌ వంటి వంటిచోట్ల భారీగా ఇసుక మేటలు ఉండటంతో దానిని తవ్వితీసేందుకు గుత్తేదారును జలవనరులశాఖ సీఈ ఎంపిక చేయాలి. ఈ ఇసుక తవ్వకాలకు అన్ని అనుమతులు తీసుకోవాలి. వీటికి అయ్యే ఫీజులు, తదితరాలను.. ఇసుక విక్రయాల్లో వసూలు చేసే నిర్వహణ ఖర్చుల నుంచి చెల్లించాలి.
 • ఇలా తవ్వితీసిన ఇసుకను జిల్లా కమిటీ ద్వారా విక్రయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని