ఫోరెన్సిక్‌ ప్రయోగశాలపై జగన్‌ దెబ్బ

జగన్‌ ప్రభుత్వ కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణం గత అయిదేళ్లలో పూర్తిగా స్తంభించింది. తమ వాటా నిధులిచ్చేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం పదేపదే లేఖలు రాసినా స్పందించకుండా,

Published : 09 Jul 2024 05:26 IST

కక్షపూరితంగా నిర్మాణం నిలిపివేత

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వ కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణం గత అయిదేళ్లలో పూర్తిగా స్తంభించింది. తమ వాటా నిధులిచ్చేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం పదేపదే లేఖలు రాసినా స్పందించకుండా, అంతకు ముందు చేపట్టిన పనులకు వినియోగ పత్రాలు (యూసీలు) సమర్పించకుండా గత వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఈ ప్రాజెక్టును కాలరాసింది. నేర పరిశోధన, శాస్త్రీయ ఆధారాల విశ్లేషణలో కీలకమైన ఈ సంస్థను అందుబాటులోకి రాకుండా చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా గుర్తిస్తోంది. 

ఎక్కడి పనులు అక్కడే ఆపేసి

తెదేపా ప్రభుత్వ హయాంలో 2017 డిసెంబరులో తుళ్లూరులో రూ. 258 కోట్లతో రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పట్లో కేంద్రం కూడా తన వాటా కింద కొంత నిధులు విడుదల చేయటంతో భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. ఆ వేగం అలాగే కొనసాగి ఉంటే ఫోరెన్సిక్‌ ప్రయోగశాల మూడు నాలుగేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చి ఉండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. నిర్మాణ పనులను ఎక్కడివక్కడే అర్ధాంతరంగా నిలిపివేశారు. గత అయిదేళ్లలో ప్రాజెక్టును అటకెక్కించేశారు. 

రాష్ట్ర వాటా నిధులివ్వలేదు 

  • ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల ఏర్పాటు, అభివృద్ధి కోసం 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 42.35 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి పనులు చేపట్టింది. వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్ర వాటా కింద ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. పైగా దాదాపు రూ. 14.36 కోట్ల విలువైన పనులకు సంబంధించి వినియోగపత్రాలు (యూసీలు) సమర్పించలేదు. 
  • 2021-22 నుంచి 2023-24 మధ్య తన వాటా కింద రూ. 109.65 కోట్లు ఇవ్వటానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. వినియోగపత్రాలు సమర్పించకపోవటం, పనుల్లో పురోగతి లేకపోవటం తదితర కారణాలతో ఆ తర్వాత దశల్లో తన వాటా కింద చేయాల్సిన నిధుల కేటాయింపు, విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. 
  • వినియోగపత్రాలు సమర్పించి, ప్రయోగశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పదేపదే లేఖలు రాసినా, నాటి జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. 

వైకాపా హయాంలో నాశనం

నేర నిరూపణలో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఎంతో అవసరం. ఏపీ పోలీసుతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఫోరెన్సిక్‌ సేవలు అందించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని తెదేపా హయాంలో తలపెట్టగా.. వైకాపా ప్రభుత్వం దాన్ని నాశనం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని