ప్రకృతి గుండెలపై విషం

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడలోని బచ్చలబందలో ఫార్మా వ్యర్థ రసాయనాల పారబోత సోమవారం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 35కు పైగా డ్రమ్ములతో రసాయన వ్యర్థాలను ఆదివారం అర్ధరాత్రి తీసుకొచ్చి బచ్చలబందలో పారబోశారు.

Updated : 09 Jul 2024 06:29 IST

బచ్చలబందలో ఫార్మా వ్యర్థ రసాయనాలు

నకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడలోని బచ్చలబందలో ఫార్మా వ్యర్థ రసాయనాల పారబోత సోమవారం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 35కు పైగా డ్రమ్ములతో రసాయన వ్యర్థాలను ఆదివారం అర్ధరాత్రి తీసుకొచ్చి బచ్చలబందలో పారబోశారు. భరించలేని దుర్వాసనతో పాటు వికారంగా ఉండడంతో గ్రామస్థులు, పశువుల కాపరులు ఇబ్బందులు పడ్డారు. పరవాడ ఫార్మాసిటీతోపాటు అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యర్థ రసాయనాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్‌ చేశారనేది తెలియలేదు. పారబోసిన రసాయనాలు సుమారు ఏడు వేల లీటర్లపైనే ఉంటుందని, అవీ భూములోకి ఇంకిపోయాయని గ్రామస్థులు వివరిస్తున్నారు. పలు ఫార్మా యాజమాన్యాలు అక్రమార్కులతో కుమ్మక్కై దొడ్డిదారిన రసాయనాలను తెచ్చి బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిస్తే బచ్చలబందతోపాటు పంట పొలాలు, భూగర్భజలాలు కలుషితమవుతాయని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నమూనాలను సేకరించారు. కొన్ని ఆధారాలు లభించాయని, తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీబీ ఈఈ ముకుందరావు తెలిపారు. 

న్యూస్‌టుడే, పరవాడ

డ్రమ్ముతో పారబోసిన రసాయనాలు 

రసాయనాలను తీసుకొచ్చిన డ్రమ్ములు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని