యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితోనే దుర్ఘటన

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం కన్పిస్తోందని ప్రభుత్వానికి పరిశ్రమల శాఖ ప్రాథమిక నివేదిక అందజేసినట్టు తెలిసింది.

Updated : 09 Jul 2024 06:23 IST

అల్ట్రాటెక్‌లో ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
లోపాలు గుర్తించినా, సరిదిద్దని వైనం

కర్మాగారం ఎదుట ఆందోళన చేస్తున్న బూదవాడ గ్రామస్థులు 

ఈనాడు-అమరావతి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు-న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం కన్పిస్తోందని ప్రభుత్వానికి పరిశ్రమల శాఖ ప్రాథమిక నివేదిక అందజేసినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోగా, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరు మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో.. ‘సిమెంట్‌్ తయారీకి వాడే ముడి పదార్థాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి పొడిగా మార్చే సమయంలో ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని మూడో అంతస్తులో ప్రీహీటర్‌ ప్రాంతంలోని ఆరో సైక్లోన్‌ వద్ద 800-900 డిగ్రీల వేడితో ఉండే సున్నపురాయి.. ఐదో సైక్లోన్‌లోకి వచ్చే మార్గం మధ్యలో రంధ్రం పడింది. అధిక ఉష్ణోగ్రత గల సున్నపురాయి పొడి ఆ రంధ్రంలో నుంచి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ఇలాంటి సందర్భాల్లో పొడి, ధూళి కిందకు పడకుండా మధ్యలోనే ఆపేందుకు సిలిండర్‌ ఆకారంలో ట్యాంకు (డమ్మీ డక్ట్‌)ను ఏర్పాటు చేస్తారు. అల్ట్రాటెక్‌ కర్మాగారంలోని ఈ డమ్మీ డక్ట్‌ పటిష్ఠంగా లేదు. ఒక్కసారిగా మూణ్నాలుగు టన్నుల సున్నపురాయి పొడి పడటంతో ట్యాంకు అడుగు భాగంలోని షీట్‌ సగం తెరుచుకొని, మొత్తం కిందకు పడిపోయింది. ఆ సమయంలో మొదటి మూడు అంతస్తుల్లో పనిచేస్తున్న 16 మంది కార్మికులపై వేడి పొడి, దుమ్ము, ధూళి పడ్డాయి. వారి శరీరాలు కాలిపోయి, గాయాల తీవ్రత పెరిగింది. చిన్నచిన్న రంధ్రాల్లోంచి వేడి పొడి కిందకు పడుతోందని కార్మికులు కొన్నాళ్లుగా చెబుతున్నా, యాజమాన్యం తీవ్రంగా పరిగణించలేదు. 4 రోజుల కిందట పైపై మరమ్మతులతో సరిపెట్టింది. ముందే అప్రమత్తమై ఉంటే ఇంతటి దుర్ఘటన జరిగేది కాదు’ అని పేర్కొన్నారు. 

పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన మహిళ

గ్రామస్థుల ఆగ్రహం.. రెండో రోజూ ఉద్రిక్తత

మరోపక్క, గాయపడ్డ కార్మికులకు పరిహారం చెల్లింపు విషయంలో యాజమాన్యం నాన్చివేత వైఖరిపై బూదవాడ గ్రామస్థులు భగ్గుమన్నారు. సోమవారం కూడా కర్మాగారాన్ని చుట్టుముట్టారు. కర్రలు, రాళ్లతో దాడికి యత్నించారు. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి, వారిని అడ్డుకున్నారు. తుదకు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన, రెవెన్యూ అధికారులు యాజమాన్యంతో చర్చించి, పరిహారాన్ని ఖరారు చేశారు. మృతుడు ఆవాల వెంకటేశ్‌ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. పిల్లలను చదివించేందుకు ఒప్పుకొంది. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ప్రమాదంపై చిల్లకల్లు పోలీసులు కేసు పెట్టారు. క్షతగాత్రుల వాంగ్మూలాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 125 (ఏ), (బి), 106 సెక్షన్లు నమోదుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నివేదిక ఆధారంగా దర్యాప్తు సాగించనున్నారు.


కార్మిక మంత్రి సుభాష్‌ పరామర్శ 

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న మంత్రి సుభాష్‌

విద్యాధరపురం, న్యూస్‌టుడే: ఈ ప్రమాదంలో గాయపడి మణిపాల్, గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)తో కలిసి రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ సోమవారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులను నియమించినట్లు చెప్పారు. కార్మికులకు ఈఎస్‌ఐ, ప్రమాద బీమా పథకాలను వర్తింపజేస్తున్నారో లేదో విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన గోపీనాయక్, శివన్నారాయణలకు కూడా నష్టపరిహారం అందించడంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కార్మిక శాఖ కమిషనర్‌ శేషగిరిబాబు, ఆర్డీవో భవానీ శంకర్, జిల్లా వైద్యాధికారి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని