సంక్షిప్త వార్తలు (11)

ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు, తాగునీటిని విజయవాడ మీదుగా తీసుకెళ్లే బందరు కాలువ, రైవస్, ఏలూరు కాలువల్లో నగరంలోని చెత్త అంతా చేరుతోంది.

Updated : 10 Jul 2024 05:10 IST

కొత్త వాహనం బాసట.. కాలువలకు ఊరట

బందరు కాల్వలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ..

ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు, తాగునీటిని విజయవాడ మీదుగా తీసుకెళ్లే బందరు కాలువ, రైవస్, ఏలూరు కాలువల్లో నగరంలోని చెత్త అంతా చేరుతోంది. వాటి శుద్ధీకరణకు నగరపాలక అధికారులు ట్రక్సర్‌ అనే సరికొత్త యంత్రాన్ని కొనుగోలు చేశారు. జేసీబీలా ఉండే ఈ యంత్రం హైడ్రాలిక్‌ సిస్టంతో పని చేస్తుంది. నీటిలో తేలుతూ కాలువల్లో పేరుకున్న చెత్త, పూడిక, గుర్రపు డెక్కను సేకరించి పక్కకు తీసుకెళ్లి పడేస్తుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల కాలువ గట్లూ దెబ్బతినవు.

ఈనాడు, అమరావతి 


రెండోరోజు మంత్రి డోలా వినతుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి రెండో రోజు మంగళవారం ప్రజలు, వివిధ సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని ఆప్కాస్‌లో చేర్చాలని పలువురు మంత్రికి విన్నవించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు స్టడీ సర్కిళ్లలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌ ఇప్పించాలని బీసీ సంఘం ప్రతినిధులు కోరారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని ఆ సంఘం ప్రతినిధులు విన్నవించారు.  


చిన్నారుల ఫొటోలు షేర్‌ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి: రాష్ట్ర మహిళా కమిషన్‌

ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల ప్రపంచం ప్రమాదకరంగా మారినందున చిన్నారుల ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి సూచించారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోపై యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. డార్క్‌ కామెడీ పేరిట తప్పుదోవపట్టిస్తున్న డిజిటల్‌ కంటెంట్‌పై ప్రభుత్వాలు నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందన్నారు.  


తొమ్మిది మందిపై వేటుకు రంగం సిద్ధం 

అటవీశాఖ ఉన్నతాధికారుల నిర్ణయం 

ఈనాడు, కర్నూలు: కర్నూలు జిల్లాలోని అటవీశాఖ పరిధిలో తొమ్మిదిమంది ఉద్యోగులు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. ‘కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం’ శీర్షికతో ఈనాడు ప్రధాన సంచికలో కథనం రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. తన పరిధిలోని నలుగురికి కర్నూలు డీఎఫ్‌వో ఛార్జిమెమోలు జారీచేశారు. అటవీప్రాంతాన్ని పరిరక్షించడంలో పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించడానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  


రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనలను నిలిపివేయాలి

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రానికి పంపిన ప్రతిపాదనను తక్షణమే నిలిపివేసేలా కోరాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విజ్ఞప్తిచేశారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ పంపిన ప్రతిపాదనలు లోపభూయిష్ఠంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.


పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలి

రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండు

ఈనాడు, అమరావతి: పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ తక్షణమే అమలు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ రైతు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండు చేశాయి. మూడు సంఘాల నాయకులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రాజెక్టు ప్రభావిత మండలాల్లో పర్యటించారు. ఆ పర్యటనలో గుర్తించిన అంశాలను నేతలు వి.కృష్ణయ్య, ప్రభాకరరెడ్డి, దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు మంగళవారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘‘కాంటూరు లెక్కలను రద్దు చేసి నిర్వాసితులందరికీ ఒకేసారి పరిహారం చెల్లించాలి. భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ యూనిట్‌గా గుర్తించాలి. వారికి రూ.10 లక్షల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, భూమికి భూమి అనే విధానం అమలు చేయాలి. మార్కెట్‌ ధరకు 4 రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలి. సాగుయోగ్యమైన భూములు ఇవ్వాలి. పునరావాస కాలనీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. చదువుకున్న వారికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించాలి’’ అని డిమాండు చేశారు. ముంపు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయడం లేదని, బ్యాంకుల్లో వ్యవసాయానికి రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


విత్తనాలపై రైతుల నుంచి ఫిర్యాదు రాలేదు

ఏపీ సీడ్స్‌ ఎండీ శివప్రసాద్‌ 

ఈనాడు, అమరావతి: ఏపీ సీడ్స్‌ ద్వారా ఇప్పటి వరకూ సరఫరా చేసిన పచ్చిరొట్ట, వరి విత్తనాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సంస్థ వీసీ, ఎండీ ఎం.శివప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘వరి, పచ్చిరొట్ట విత్తనాలూ నాసిరకమే’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా పరీక్షలు నిర్వహించాకే పంపిణీ చేశామన్నారు. ప్రతికూల పరిస్థితులతో విత్తనాల మొలక శాతం తగ్గిందని నిర్ధారిస్తే.. రైతుల్ని ఆదుకునేలా విత్తన సంచులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు.. నాసిరకమని పరీక్షల్లో తేలినా.. ఫిర్యాదుల్లేవని అధికారులు చెప్పడమేంటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 


ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్లను క్రమబద్ధీకరించాలని వినతి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించాలని మంత్రి లోకేశ్‌ను ఆర్ట్, వర్క్, హెల్త్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పార్ట్‌ టైమ్‌ కాంట్రాక్టు ఇన్‌స్ట్రక్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.దేవేంద్రరావు కోరారు. ఈ మేరకు మంగళవారం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. పోస్టులను క్రమబద్ధీకరించే వరకూ మినిమం టైం స్కేల్, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. 


నేటి నుంచి అగ్రి బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు 

గుంటూరు (జిల్లా పరిషత్తు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అగ్రి బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామచంద్రరావు తెలిపారు. బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో, బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల పదో తేదీన వర్సిటీ వెబ్‌సైట్‌ angrau.ac.in లో దరఖాస్తులతో పాటు వివరాలు అందుబాటులో ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 


జలవనరులశాఖ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సీఈ, ఎస్‌ఈ పోస్టుల్లో పలువురు ఇంజినీర్లను ప్రభుత్వం నియమించి.. వారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజినీర్‌గా నూజివీడు క్వాలిటీ కంట్రోల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఎన్‌.పుల్లారావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు (అనంతపురం) సీఈగా విజయవాడలోని ఈఎన్‌సీ కార్యాలయ ఎస్‌ఈ కె.నాగరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒంగోలు సీఈ (ప్రాజెక్ట్సు)గా విజయవాడలోని సీఈ కార్యాలయ ఎస్‌ఈ కె.రవికి, విజయవాడ సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ సీఈగా ఏలూరులోని నీరు-ప్రగతి ప్రాజెక్టు ఎస్‌ఈ వైౖ.శ్రీనివాస్‌కు, తిరుపతి ఎన్టీఆర్‌టీజీ సీఈగా కర్నూలు హెచ్‌ఎన్‌ఎస్‌స్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డి.రామగోపాల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 


శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల అప్పగింతపై విచారణ ఆగస్టు 20కి వాయిదా 

ఈనాడు, దిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి అనుమతి లేకుండానే విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నీటిని వినియోగిస్తున్నందున ఆ రెండు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ ఆగస్టు 20కి వాయిదా పడింది. ఇదివరకు ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవడానికి కొంత సమయం కావాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఆగస్టు 20వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని