ఈవీ బ్యాటరీలకు ఊతం

విద్యుత్తు వాహనాల బ్యాటరీ లోహాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు.. భారత్‌లో ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసానిచ్చే విషయాన్ని వెల్లడించారు.

Published : 10 Jul 2024 05:03 IST

కడప బేసిన్‌లో నికెల్‌ నిక్షేపాలను గుర్తించిన ఎన్‌జీఆర్‌ఐ
ఈనాడు, హైదరాబాద్‌

కడప బేసిన్‌లో నమూనాలు సేకరించిన ప్రాంతం 

విద్యుత్తు వాహనాల బ్యాటరీ లోహాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు.. భారత్‌లో ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసానిచ్చే విషయాన్ని వెల్లడించారు. బ్యాటరీ తయారీలో లిథియంతోపాటు నికెల్, కోబాల్ట్‌ లోహాలు అవసరం. మాగ్నటిక్‌ సల్ఫైడ్‌ ధాతువు నిక్షేపాల నుంచి వాటిని వెలికితీస్తారు. విదేశాల నుంచే వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. నికెల్‌ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప బేసిన్‌లో ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల ఆధారంగా ఎన్‌జీఆర్‌ఐ గుర్తించింది. నికెల్‌ నిక్షేపాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో కెనడా ఒకటి. అక్కడ 1.88 బిలియన్‌ సంవత్సరాల క్రితం పడిన ఉల్కాపాతం అనంతరం ఏర్పడిన శిలల్లో వాటిని గుర్తించారు. అంతే వయసు కలిగిన కడప బేసిన్‌లోనూ ఆ నిక్షేపాలు ఉండొచ్చు అనే ఆలోచనతో ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త పి.వి.సుందరరాజు అక్కడి నుంచి శిలల నమూనాలు సేకరించి పరిశోధనలు చేపట్టారు. పాలియోమాగ్నటిక్, జియోక్రోనాలజీ టెక్నిక్స్‌ను ఉపయోగించి చేసిన పరిశోధనలో నికెల్‌ సంభావ్యత కనిపించింది. మాగ్నటిక్‌ సల్ఫైడ్‌ మినరలైజేషన్‌ సాంద్రతలను కడప బేసిన్‌లోని శిలలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. నికెల్‌ నిక్షేపాలకు సంబంధించిన పరిశోధన పత్రం ‘ది కెనడియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మినరాలజీ అండ్‌ పెట్రాలజీ’లో ప్రచురితమైంది. కడప బేసిన్‌లో బహుళ లోహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని వివరించారు. 

పెట్టుబడిదారుల్లో భరోసా.. 

గతంలో జమ్మూకశ్మీర్‌లో లిథియం నిల్వలు, ఇప్పుడు కడప బేసిన్‌లో నికెల్‌ నిల్వల గుర్తింపుతో ఈవీ రంగానికి భరోసానిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.దిగుమతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైనా.. మన దేశంలోనే నిల్వలు ఉన్నాయనే భరోసాతో కంపెనీలు బ్యాటరీ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

  •  2022-23 ఆర్థిక సంవత్సరంలో  లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్‌ దిగుమతికి మన దేశం రూ.34,800 కోట్లు ఖర్చు చేసింది. 
  •  కాపర్‌ కోసం అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం వెచ్చిస్తుండగా.. రెండో స్థానంలో నికెల్‌ లోహం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 32,300 టన్నుల ముడి లోహాన్ని భారత్‌ రూ.6,550 కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని