వయోజన మిథ్య!

వయోజన విద్యాశాఖను వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి మూడేళ్లపాటు అక్షరాస్యత కార్యక్రమాలు లేకుండా చేసింది.

Published : 10 Jul 2024 04:18 IST

నవభారత్‌ అక్షరాస్యతకు కేంద్రం నిధులిచ్చినా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం 
ఇక్కడ పని లేదంటూ ఇతర విభాగాలకు డిప్యూటేషన్లు
 కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తే  నిరక్షరాస్యత నిర్మూలన దిశలో అడుగులు 
ఈనాడు - అమరావతి 

వయోజన విద్యాశాఖను వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి మూడేళ్లపాటు అక్షరాస్యత కార్యక్రమాలు లేకుండా చేసింది. రాష్ట్రంలో 40.50 లక్షల మంది నిరక్షరాస్యులున్నా అక్షరాస్యత కార్యక్రమాలు అమలు చేయలేదు. ఐదేళ్లలో నాలుగు నెలలపాటు చేపట్టిన పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌ మినహా ఇతర పథకాలనే చేపట్టలేదు. కొత్త ప్రభుత్వం దృష్టి సారించి అక్షరాస్యత కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వయోజన విద్యలో పని లేదంటూ గతంలో క్షేత్రస్థాయి సిబ్బందిని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఆ తర్వాత కేంద్రం కొత్త పథకం తీసుకురావడంతో వారిని వయోజన విద్యాశాఖకు తీసుకొచ్చినా నాలుగు నెలలే అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ పని లేకపోవడంతో కొందరు ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై వెళ్లిపోగా.. రాజకీయ సిఫార్సులతో ఎస్జీటీ టీచర్లను ఈ విభాగంలో విలీనం చేశారు. 

ఇదీ దుస్థితి..

కేంద్రం 2022లో ఐదేళ్ల అమలు లక్ష్యంతో నవభారత్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని కింద 2022-23 సంవత్సరానికి రూ.8.54 కోట్లు మంజూరు చేసి రూ.6.40 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వాటా 40 శాతం రూ.2.56 కోట్లు ఇవ్వాల్సి ఉంది. గతేడాది ఆగస్టు వరకు ఈ నిధులు విడుదల చేయలేదు. నిబంధనల ప్రకారం 2022-23లో ఈ నిధులతో 4.15 లక్షల మందిని అక్షరాస్యులను చేయాలి. కేంద్ర నిధులనే వైకాపా ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వగా, కార్యక్రమం అమలు మార్గదర్శకాల జారీలో అప్పటి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మరింత జాప్యం చేశారు. జగన్‌ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకపోవడంతో 2023-24కు కూడా నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. గతంలో ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తే కొత్తగా రూ.14.51 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది.

మూడేళ్లుగా ఖాళీనే..

సాక్షరభారత్‌ను అప్పట్లో తెదేపా ప్రభుత్వం 2018 వరకు నిర్వహించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం 2019 నుంచి 2021 వరకు నాలుగు నెలలు మినహా అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించలేదు. మరోవైపు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సుతో ఎనిమిది మంది ఎస్జీటీలను వయోజన విద్యలో విలీనం చేశారు. అర్హత లేకపోయినా పెద్దిరెడ్డి సిఫార్సు చేశారని ఇద్దరు ఉద్యోగులకు సహాయ ప్రోగ్రామింగ్‌ అధికారులుగా పదోన్నతినిచ్చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు