తెదేపా కార్యాలయంపై దాడి కేసు.. హైకోర్టులో విచారణ

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైకాపా నేత దేవినేని అవినాష్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

Published : 10 Jul 2024 04:20 IST

ఈనాడు, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైకాపా నేత దేవినేని అవినాష్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. అవినాష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదించారు. ‘పిటిషనర్‌ ప్రోద్బలంతోనే కార్యాలయంపై దాడి చేసినట్లు ఆధారాలు లేవు. ఈ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత దర్యాప్తు పేరుతో పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించండ’ని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదిస్తూ.. ‘తెదేపా కార్యాలయంపై దాడి ఘటన చిన్న వ్యవహారం కాదు. అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఓ ప్రణాళిక ప్రకారం దాడికి దిగి పలువురిని గాయపరిచారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మొత్తం 6 సీసీ కెమెరాల్లో రికార్డయింద’ని పేర్కొన్నారు. ఇదే వ్యవహారంతో ముడిపడిన కేసులో వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేసిన బెయిలు పిటిషన్‌తో కలిపి ప్రస్తుత పిటిషన్లను బుధవారం విచారించాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని