ఇక ‘వాహన్‌’లోనే రవాణాశాఖ సేవలు

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో వాహన్‌ పోర్టల్‌ ద్వారానే సేవలన్నింటినీ అందించనున్నారు.

Published : 10 Jul 2024 04:24 IST

 ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అమలు
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ 

ఈనాడు, అమరావతి: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో వాహన్‌ పోర్టల్‌ ద్వారానే సేవలన్నింటినీ అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అమలుచేసి, తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వానికి చెందిన సొంత పోర్టల్‌ ఈ-ప్రగతితో పాటు వాహన్‌నూ అమలుచేస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి చెందిన వాహన్‌ పోర్టల్‌లో అనేక సమస్యలున్నాయి. ముందుగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురానున్నారు. 

 దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలని.. 

2016లో సీఎం చంద్రబాబు.. రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవల కోసం ఈ-ప్రగతి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టారు. దీనిద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీ, వాహనాల బదిలీ, రెన్యువల్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఎన్వోసీల జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపు వంటి సేవలు అందేవి. కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలని ‘వాహన్‌’ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిని ఎన్‌ఐసీ పర్యవేక్షిస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోనూ దీన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాహన్‌ ద్వారానే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. వాహన్‌లో భాగమైన సారథి పోర్టల్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌లు ఇస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతి ద్వారానే అందుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వాహనాల సమాచారాన్ని ఏపీలో తీసుకోవాలంటే ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు రకాల పోర్టల్స్‌కు బదులు ఒకే దానిని అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించారు.

 ప్రయోగాత్మకంగా అమలు 

ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేముందు సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు వాహన్‌ను ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అమలుచేస్తున్నారు. వాహన్‌ రాకముందు ఈ-ప్రగతి ద్వారా అందిన సేవల సమాచారాన్ని ఎన్‌ఐసీ సర్వర్‌లోకి బదిలీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాహన్‌ వెబ్‌సైట్‌ నెమ్మదిగా ఉండటంతో డేటా మొత్తం ఎన్‌ఐసీలోకి చేరడంలో ఆలస్యం అవుతోంది. పలు సేవల వివరాలు కనిపించట్లేదు. వీటిని ఎన్‌ఐసీ సాంకేతిక నిపుణులు పరిష్కరించాక పూర్తిగా వాహన్‌ పోర్టల్‌ ద్వారానే సేవలు అందించనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని