ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి రాజీనామా ఆమోదం

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 10 Jul 2024 04:28 IST

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతపురం జేఎన్‌టీయూలో మెకానికల్‌ ప్రొఫెసర్‌గా ఉండే ఆయన్ని గత ప్రభుత్వం ఛైర్మన్‌గా నియమించింది. రెండో పర్యాయం పొడిగింపు ఇచ్చింది. ఆయన హయాంలో సంస్కరణల పేరుతో ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉపకులపతుల నియామకం నుంచి వర్సిటీల్లో పోస్టుల హేతుబద్ధీకరణ వరకు ఆయన చెప్పిందే వేదంగా సాగింది. ఉన్నత విద్యా మండలి నిధులను ప్రాజెక్టుల పేరుతో దారి మళ్లించినట్లు, వైకాపా సానుభూతిపరులను మండలిలో నియమించినట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే కొన్ని కీలక దస్త్రాలను ధ్వంసం చేసి, ఆ వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడకపోవడంతో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి.. ఆ రాజీనామాను ఆమోదించకుండా మెడికల్‌ లీవ్‌ ఇచ్చారు. జులై 1న విధుల్లో చేరిన హేమచంద్రారెడ్డి మళ్లీ సెలవులో వెళ్లిపోయారు. తాజాగా ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. 

ఉన్నత విద్యామండలిలో 2019-2024 వరకు జరిగిన అవకతవకలపై విచారించాలని కోరుతూ కర్నూలుకు చెందిన శ్రీరాములు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని