ప్రైవేటు వర్సిటీల జాబితా అప్‌లోడ్‌ ఆలస్యం

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల జాబితాను అప్‌లోడ్‌ చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

Published : 10 Jul 2024 04:52 IST

 ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ అభ్యర్థుల్లో ఆందోళన 

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల జాబితాను అప్‌లోడ్‌ చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక కోసం వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు కళాశాలల జాబితాను పరిశీలించగా.. రాత్రి 7.30 గంటల దాకా ప్రైవేటు విశ్వవిద్యాలయాల జాబితా ఆన్‌లైన్‌లో కనిపించలేదు. వెబ్‌సైట్‌లో త్వరలో అప్‌లోడ్‌ చేస్తామని మెసేజ్‌ పెట్టినా కొంతమంది విద్యార్థులు దీన్ని పూర్తిగా చదవకపోవడం, వెబ్‌ ఆప్షన్స్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో గతేడాది వరకు ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా.. ఈ ఏడాది మరో మూడింటికి వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 35 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ సీట్లకు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ప్రత్యేకంగా ఫీజులను నిర్ణయిస్తుంది. కమిషన్‌ ఫీజులు నిర్ణయించినా వీటికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులివ్వడంలో ఉన్నత విద్యాశాఖ ఆలస్యం చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించాలి. కళాశాలల ఫీజులు, అనుమతుల ఉత్తర్వులు రావడంలో జాప్యం జరగడంతో మంగళవారం నుంచి వెబ్‌ ఐచ్ఛికాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు ఒకరోజు అవకాశాన్ని కోల్పోయినా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని