తిరుపతిలో ప్రబలిన అతిసారం

తిరుపతి నగరంలో అతిసారం బారినపడి ఇద్దరు అనాథ మానసిక దివ్యాంగులు మృత్యువాత పడ్డారు.

Published : 10 Jul 2024 05:01 IST

ఇద్దరు మానసిక దివ్యాంగుల మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం 

రుయాలో చికిత్స పొందుతున్న దివ్యాంగులు

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి నగరంలో అతిసారం బారినపడి ఇద్దరు అనాథ మానసిక దివ్యాంగులు మృత్యువాత పడ్డారు. మరో 14 మంది రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, విషమంగా ఉన్న మరో ఇద్దరిని స్విమ్స్‌కు తరలించారు. పద్మావతిపురంలోని మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల (పాస్‌ మనో వికాస్‌)లో కొందరు దివ్యాంగులు రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారు. పాఠశాల యాజమాన్యం సోమవారం ఉదయం గణపతి(30)ని రుయా ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మంగళవారం వేకువజామున శేషాచలం(16) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రుయా చిన్నపిల్లల వార్డుకు తీసుకురాగా అప్పటికే చనిపోయాడు. మరికొందరిని రుయాకు తరలించారు. డీఎంహెచ్‌వో శ్రీహరి, రుయా సూపరింటెండెంట్‌ రవిప్రభు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వీరికి వైద్యసేవలు అందించారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్, తిరుపతి ఆర్డీవో నిషాంత్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి పర్యవేక్షించారు. విషమంగా ఉన్న తేజస్వి, పరదీప్‌లను రాత్రి స్విమ్స్‌కు తరలించారు. ఎన్జీవో ఆధ్వర్యంలో నడిచే ఈ ఆశ్రమ పాఠశాలలో 72 మంది ఉన్నారు. జులై 6న మధ్యాహ్నం అల్పాహారం తీసుకున్నాక పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్, రుయా సూపరింటెండెంట్‌ రవిప్రభుకు ఫోన్‌చేసి ఆరాతీశారు. ప్రత్యేక దృష్టి సారించి వైద్యసేవలందించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని