అమరావతిలో సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం

రాజధాని అమరావతికి జవసత్వాలు కల్పించి, ఆర్థికంగా పురోగమించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జగన్‌ హయాంలో చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు అధికారులు ఉపక్రమించారు.

Published : 11 Jul 2024 04:59 IST

ఒప్పందాల గడువు పొడిగిస్తున్న ప్రభుత్వం
వైకాపా హయాంలో గాలికొదిలేసిన జగన్‌

ఈనాడు - అమరావతి: రాజధాని అమరావతికి జవసత్వాలు కల్పించి, ఆర్థికంగా పురోగమించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జగన్‌ హయాంలో చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు అధికారులు ఉపక్రమించారు. గతంలో తెదేపా హయాంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి గడువు తీరిన ఒప్పందాలను పొడిగిస్తున్నారు. ఇంకా ఏర్పాటు కాని సంస్థల ఉన్నతాధికారులతో సీఆర్డీఏ అధికారులు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నారు. తెదేపా హయాంలో 131 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు  భూములు కేటాయించారు. సంస్థలు ఏర్పాటయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని కొన్నింటికి ఉచితంగా, మరికొన్నింటికి నామమాత్ర ధరతో భూములిచ్చారు. చంద్రబాబు హయాంలో 8 సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయి. 

జగన్‌ ప్రభుత్వ వైఖరితో దూరం

తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. సంస్థల ఏర్పాటుకు కల్పించాల్సిన కనీస వసతులపైనా దృష్టి సారించలేదు. ఎస్‌ఆర్‌ఎం, విట్, ఎన్‌ఐడీ, అమృత వంటి విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టినా.. రోడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2019-24 మధ్య జగన్‌ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినా, ఒక్క సంస్థకూ భూమిని కేటాయించలేదు. ఈ ఐదేళ్లలో పలు సంస్థలు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నా జగన్‌ వైఖరితో వెనుకంజ వేశాయి. ఫలితంగా గత ఐదేళ్లలో ఒక్కటి కూడా నిర్మాణం ప్రారంభించలేదు. 

సీఆర్డీఏ అధికారుల సంప్రదింపులు

గతంలో తెదేపా హయాంలో ఆయా సంస్థలకు భూములు ఇచ్చినప్పుడు వాటి ఏర్పాటుకు కొన్నింటికి ఆరు నెలలు, మరికొన్నింటికి ఏడాది గడువిచ్చారు. ప్రభుత్వం మారడం, అమరావతి పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో సీఆర్డీఏ అధికారులు.. ఆయా సంస్థలతో మళ్లీ సంప్రదింపులు సాగిస్తున్నారు. గడువు తీరిన ఒప్పందాలను పొడిగిస్తున్నారు. దీని వల్ల ఆ సంస్థలు రాజధానికి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే దిగ్గజ బిజినెస్‌ స్కూల్‌ అయిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సుముఖత వ్యక్తం చేయగా.. మరికొన్ని ఇదే బాటలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని