సంక్షిప్త వార్తలు (9)

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం చెల్లించని డైట్‌ ఛార్జీల బకాయిలను త్వరలో విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Updated : 11 Jul 2024 06:02 IST

పెండింగ్‌ డైట్‌ ఛార్జీలు త్వరలో విడుదల
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా

ఈనాడు, అమరావతి: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం చెల్లించని డైట్‌ ఛార్జీల బకాయిలను త్వరలో విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. వసతి గృహాల్లోని ఖాళీలను కూడా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం తనను కలిసిన గురుకుల ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులకు ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలని, వసతి గృహాల్లోని విద్యార్థినులకు ప్రతి నెలా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని సంఘాల నాయకులు మంత్రికి విన్నవించారు.


ఇద్దరు పుర కమిషనర్ల బదిలీ

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో కీలకమైన మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌ను ప్రభుత్వం బాపట్ల పురపాలక సంఘం కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ షేక్‌ అలీంబాషాను నియమించింది. నిర్మల్‌కుమార్‌ గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు అంటకాగారనే ఆరోపణలొచ్చాయి. బాపట్ల పురపాలక కమిషనర్‌ శ్రీకాంత్‌ను మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఉపకమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడి ఉపకమిషనర్‌ శివారెడ్డిని పురపాలకశాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అధికారులకు అనుమతి 

ఈనాడు, అమరావతి: మూలపేట పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంపీడీసీఎల్‌) వీసీఎండీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీసీఎండీగా కేంద్ర సర్వీసులకు చెందిన చావల బాబూరావు డిప్యుటేషన్‌ వ్యవధి నెలాఖరుతో ముగియనుంది. ఆయన తిరిగి లోక్‌సభ సచివాలయ డిప్యూటీ సెక్రటరీగా వెళ్లనున్నారు. 

ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ సీఈవో ఎస్‌వీకే రెడ్డికి కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మారిటైం బోర్డు ముఖ్య ఇంజినీర్‌ వీర రాఘవరావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.


కుదేలైన నిర్మాణ రంగానికి ఉచిత ఇసుకతో పునరుజ్జీవం
తెదేపా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానంపై వైకాపా నాయకులు, నీలి మీడియా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కుదేలైన నిర్మాణ రంగానికి ఉచిత ఇసుకతో సీఎం చంద్రబాబు పునరుజ్జీవం పోశారని తెలిపారు. జగన్‌ చేయలేని పనిని చంద్రబాబు చేయడంతో వైకాపా నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. లక్షల మంది కార్మికులు తిరిగి ఉపాధి పొందేందుకు ఉచిత ఇసుక విధానం తోడ్పడుతుందన్నారు. ఐదేళ్లలో వైకాపా నేతలు రాష్ట్రంలోని సహజ వనరులన్నీ లూటీ చేశారని ధ్వజమెత్తారు. ఇకనైనా వైకాపా నేతలు నిజాలు మాట్లాడాలని హితవుపలికారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి పథకాలు తీసుకొస్తామని పేర్కొన్నారు.


ఐచ్ఛిక భాషలో బోధన నిర్ణయం హర్షణీయం

ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల స్థాయిలో ఐచ్ఛిక భాషను బోధనా మాధ్యమంగా తీసుకోవచ్చని సీబీఎస్‌ఈ చెప్పడం హర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తమకు నచ్చిన భారతీయ భాషను బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకునే వెసులుబాటును సీబీఎస్‌ఈ ఇటీవల కల్పించిందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన పొందటం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు.


ప్రాథమిక విద్యా వ్యవస్థను చక్కదిద్దండి: యూటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారిందని.. మంత్రి నారా లోకేశ్‌ పరిస్థితులను చక్కదిద్దాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ కోరారు. విజయవాడలో బుధవారం వారిద్దరూ విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 4,457 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేశారు. 1, 2 తరగతులతో మిగిలిన వాటిలో విద్యార్థులు చేరడం లేదు. ఈ ఏడాది సుమారు 20 వేల పాఠశాలల్లో 10, 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 750 బడుల్లో ఒక్కరూ చేరలేదు. ప్రవేశాలు తగ్గడం చూస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది’’ అని వివరించారు.


సంక్షేమ సొసైటీ ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ హామీ
ఏపీ ఆరోగ్య మిత్ర సమాఖ్య వెల్లడి

ఈనాడు డిజిటల్, అమరావతి: తమ సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ లక్ష్మీశ సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య మిత్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవింద్, గురవయ్య తెలిపారు. ఉద్యోగ విరమణకు సంబంధించిన అంశాలపై ఆరోగ్య మిత్రలకు ప్రయోజనం చేకూరేలా సంక్షేమ సొసైటీ ఏర్పాటు చేస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు బుధవారం ఓ ప్రకటనలో వారు వెల్లడించారు. పెండింగులో ఉన్న వేతనాలతో పాటు సస్పెండ్‌ అయిన ఆరోగ్య మిత్రలను తిరిగి చేర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.


వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ఈనాడు, అమరావతి: సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేశారు. మే, జూన్‌ నెల వేతనాలు రావాల్సి ఉందని, అవి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఐకాస ఛైర్మన్‌ కాంతారావు మాట్లాడుతూ.. ‘‘సమయానికి వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా వేతనాలు వచ్చేలా బడ్జెట్‌ విడుదల చేయాలి. గతంలో సమ్మె చేసిన కాలానికి జీతాలు, సమ్మెలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ రూపొందించాలి’’ అని కోరారు.


ఉన్నత విద్యలో సమస్యలు పరిష్కరించాలి

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్‌కు ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసన్నకుమార్, అశోక్‌ వినతిపత్రం సమర్పించారు. ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల కారణంగా విద్యార్థులు కళాశాలలను ఎంచుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని, మేజర్, మైనర్‌ సబ్జెక్టు విధానంతో డిగ్రీలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. రద్దు చేసిన బీకాం కోర్సును కొనసాగించాలని, పీజీ సీట్ల భర్తీ విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించాలని విన్నవించారు. ఉత్తర్వులు-77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని