నిర్మాణాలే కాలేదు తరగతులు ఎలా?

గుత్తేదారులకు వైకాపా సర్కారు బిల్లుల చెల్లింపు చేయనందున 5 కొత్త వైద్య కళాశాలల్లో భవన నిర్మాణాలు కొనసాగించేందుకు గుత్తేదారులు మొండికేశారు.

Published : 11 Jul 2024 04:03 IST

గుత్తేదారుల పెండింగ్‌ బిల్లులు రూ.200 కోట్లు 
ఐదు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతించని ఎన్‌ఎంసీ
నాటి వైకాపా ప్రభుత్వ నిర్వాక ఫలితం

ఈనాడు, అమరావతి: గుత్తేదారులకు వైకాపా సర్కారు బిల్లుల చెల్లింపు చేయనందున 5 కొత్త వైద్య కళాశాలల్లో భవన నిర్మాణాలు కొనసాగించేందుకు గుత్తేదారులు మొండికేశారు. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి... యంత్రాలను వెనక్కు తీసుకువెళ్తున్నారు. కార్మికులను పంపించేస్తున్నారు. గత ఏడాది జులై నుంచి నిర్మాణాలు మందకొడిగా సాగుతూ రాగా.. ప్రస్తుతం దాదాపుగా నిలిచిపోయాయి. 2024-25 విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలోని వైద్య కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభానికి తగ్గట్లు నిర్మాణాలు చేపట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. దీంతో వీటిలో ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అనుమతి నిరాకరించింది. మార్కాపురం, మదనపల్లె కళాశాలల్లో నిర్మాణాల కోసం 2023 ఫిబ్రవరి... పులివెందుల, ఆదోనిలోని నిర్మాణాలకు 2022 డిసెంబరు... పాడేరులో నిర్మాణాలకు 2021 జూన్‌లో ఒప్పందాలు జరిగాయి. వైకాపా ప్రభుత్వ అలసత్వం, నిధుల కేటాయింపులో జాప్యం, ఇతర కారణాలతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. 2024 మార్చి నాటికి తరగతుల ప్రారంభానికి తగినట్లు భవనాలు అందుబాటులోకి రాలేదు. ఈ 5 కళాశాలల్లో నిర్మాణాలకు రూ.2,425 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటివరకు రూ.533 కోట్లే(22%) ఖర్చుపెట్టారు. ఇందులోనూ రూ.200 కోట్ల బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ జరగలేదు. 

అన్నిచోట్లా అదే పరిస్థితి

మదనపల్లె కళాశాలకు రూ.475 కోట్ల వరకు అవసరం కాగా రూ.30 కోట్ల (6%) మేర పనులే పూర్తయ్యాయి.  మార్కాపురం, ఆదోని కళాశాలలకు రూ.475 కోట్ల చొప్పున కేటాయించగా.. రూ.47 కోట్ల చొప్పున (10%) మాత్రమే ఖర్చుపెట్టారు. పాడేరు కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా కాగా 23%, పులివెందుల కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లకు 58% పనులు పూర్తిచేశారు. పాడేరు కళాశాల నిర్మాణానికి అవసరమైన రూ.500 కోట్లలో రూ.195 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మిగిలిన కళాశాలల నిర్మాణాలకు నాబార్డు 4% వడ్డీపై అవసరమైన నిధుల్లో 85% వరకు రుణరూపంలో ఇస్తోంది. నాబార్డు రుణం కింద అందచేసిన మొత్తాన్నీ వైకాపా ప్రభుత్వం విడుదల చేయలేదు. మొత్తం 17 కళాశాలలకు కలిపి రూ.8,480 కోట్ల వరకు ఖర్చుపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధంచేయగా రూ.1,451 కోట్లనే (17%) వైకాపా సర్కారు వెచ్చించింది. 

పదోన్నతులు ఇచ్చేందుకు వైద్యులేరీ? 

ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. పదోన్నతులు ఇచ్చేందుకు ప్రయత్నించినా అర్హులైన వైద్యులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లేరు. కళాశాలలకు అవసరమైన ప్రొఫెసర్లలో 51%, అసోసియేట్‌ ప్రొఫెసర్లలో 46% మంది తక్కువగా ఉన్నారు. పులివెందుల కళాశాలలో 48%, మార్కాపురం- 42%, ఆదోని- 37%, పాడేరు- 32%, మదనపల్లెలో 13% చొప్పున వైద్యుల కొరత ఉన్నట్లు ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీల ద్వారా గుర్తించాయి. ఫలితంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని