ఖనిజాలు తరలిపోతున్నాయ్‌!

రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాల్లో అటు సీనరేజ్‌ గుత్తేదారులు పర్మిట్లు జారీ చేయక.. ఇటు గనులశాఖ పర్మిట్లు ఇవ్వకుండానే.. కొందరు లీజుల నుంచి దర్జాగా ఖనిజాల్ని తరలించేస్తున్నారు.

Published : 11 Jul 2024 04:18 IST

పర్మిట్లు లేకుండా కొల్లగొట్టేస్తున్నారు
నిత్యం రూ.కోట్లలో రాబడి కోల్పోతున్న ప్రభుత్వం 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాల్లో అటు సీనరేజ్‌ గుత్తేదారులు పర్మిట్లు జారీ చేయక.. ఇటు గనులశాఖ పర్మిట్లు ఇవ్వకుండానే.. కొందరు లీజుల నుంచి దర్జాగా ఖనిజాల్ని తరలించేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం నిత్యం భారీగా రాబడి కోల్పోతున్నా సరే గనులశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లీజుదారుల నుంచి సీనరేజ్‌ వసూళ్ల టెండర్లను వివిధ సంస్థలు దక్కించుకున్నాయి. ఇవన్నీ వైకాపా పెద్దలకు సన్నిహితులైన వారి సంస్థలే. గత ఏడాది నుంచి ఆయా జిల్లాల్లో ఈ సంస్థలే ఆఫ్‌లైన్‌లో ముద్రిత పర్మిట్లు జారీచేస్తున్నాయి. అదే సమయంలో పలు జిల్లాల్లో ఈ సంస్థలు దందాలు చేస్తూ, ఇష్టానుసారం వ్యవహరిస్తూ వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీనరేజ్‌ గుత్తేదారులకు అడ్డుకట్ట పడింది. కొన్నిచోట్ల పర్మిట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే లీజుదారులు ఎదురు తిరిగారు. ఇంతకాలం దందాలు చేసి, ఇప్పుడు ఎలా కొనసాగుతారని మండిపడ్డారు. దీంతో ఏడు ఉమ్మడి జిల్లాల్లోనూ సీనరేజ్‌ గుత్తేదారులు పర్మిట్లజారీ ఆపేశారు. గనులశాఖ తరఫునా జిల్లాల్లో పర్మిట్లు ఇవ్వడం లేదు. దీంతో రోడ్‌ మెటల్, గ్రానైట్, గ్రావెల్‌ తదితర ఖనిజాలు ఎటువంటి పర్మిట్లూ లేకుండా తరలిపోతున్నాయి. 

ప్రత్యామ్నాయం చూడని గనులశాఖ

సీనరేజ్‌ గుత్తేదారు వరుసగా రెండు నెలలపాటు టెండరులో పేర్కొన్న సొమ్ము చెల్లించకపోతే... తాఖీదు ఇచ్చి చర్యలు తీసుకోవచ్చు. మరోవైపు గనులశాఖ అధికారులు ఆ జిల్లాల్లో గతంలో మాదిరిగా ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీ చేసేందుకు అవకాశం కల్పించే నిబంధన ఉంది. ఈ విషయం తెలిసినా సరే అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా లీజుదారులు దర్జాగా పర్మిట్లు లేకుండా ఖనిజాలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం రూ.కోట్లలో రాబడి కోల్పోతోంది.

గుజరాత్‌ నుంచి సిలికాశాండ్‌

తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని సిలికాశాండ్‌లో వైకాపా నేతలు దందా చేశారు. చెన్నై మైనింగ్‌ వ్యాపారికి సంబంధించిన వారు నాలుగు సంస్థల పేరిట మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌ తీసుకొని ఏకఛత్రాధిపత్యం నడిపారు. ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారం సిలికాశాండ్‌ తవ్వుకున్నారు. నాలుగేళ్లపాటు వీరి దోపిడీ సాగాక.. గత ఏడాది నుంచి స్థానిక వైకాపా నేతలు ఈ దందాను తమ చేతుల్లోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సిలికాశాండ్‌ విక్రయాలు ఆపేశారు. వీటికి గనులశాఖ పర్మిట్లు జారీ చేయకుండా నిలిపేసింది. నెలకుపైగా పర్మిట్ల జారీ లేకపోవడంతో.. కోయంబత్తూరు కేంద్రంగా ఉండే పలు కంపెనీలు.. గుజరాత్‌ నుంచి సిలికాశాండ్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చిల్లకూరు, కోట మండలాల్లో చిన్నచిన్న డీలర్లు నష్టపోతున్నారు. 100 మంది వరకు చిన్నచిన్న లైసెన్సుదారులు ఒక్కొక్కరి దగ్గర బిల్లులతో కొనుగోలు చేసిన సిలికాశాండ్‌ వెయ్యి నుంచి 5 వేల టన్నులు చొప్పున ఉంది. దీనిని విక్రయించుకునేలా అనుమతులు ఇవ్వాలని వారంతా గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని