భూమి అమ్మలేదని ‘రుద్రభూమి’గా మార్చేశారు!

తమకు భూమి అమ్మలేదని అక్కసుతో వైకాపాకు చెందిన ఇద్దరు సర్పంచులు కూడబలుక్కొని ఆ భూమిలో మృతదేహాలను పాతిపెట్టించి శ్మశానంగా మార్చారని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఎదుట ఓ ప్రభుత్వోద్యోగి, ఆయన కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు.

Published : 11 Jul 2024 04:20 IST

వైకాపా సర్పంచుల దారుణ వ్యవహారం
పెద్దిరెడ్డి అండతో ప్రభుత్వోద్యోగిపై కక్షసాధింపు 

\

మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు వివరాలు వెల్లడిస్తున్న బాధితులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: తమకు భూమి అమ్మలేదని అక్కసుతో వైకాపాకు చెందిన ఇద్దరు సర్పంచులు కూడబలుక్కొని ఆ భూమిలో మృతదేహాలను పాతిపెట్టించి శ్మశానంగా మార్చారని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఎదుట ఓ ప్రభుత్వోద్యోగి, ఆయన కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అండ చూసుకుని అక్రమ కేసులు పెడతామని పోలీసుల చేత బెదిరింపులకు దిగారని బాధితులు బుధవారం ఎమ్మెల్యేకు విన్నవించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్యోద్యోగి యేసువర్ధన్‌రావు, బాధితురాలు అల్లాడి శ్రీలక్ష్మి ఎమ్మెల్యేకు తెలిపిన వివరాలు ప్రకారం... సీటీఎం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డికి చెందిన 99 సెంట్ల భూమిని ప్రభుత్యోద్యోగి యేసువర్ధన్‌రావు కొని తన కుమార్తె శ్రీలక్ష్మికి కట్నం కింద ఇచ్చారు.  కొన్న తర్వాత భూమిచుట్టూ ప్రహరీ నిర్మించుకుని కాపాడుకుంటూ వచ్చామని వివరించారు. ఈ భూమిని స్థానికంగా ఉన్న ఇద్దరు సర్పంచులు తమకు విక్రయించాలని కోరారని అందుకు తాము నిరాకరించడంతో కక్షపెంచుకున్న వారు భూమి చుట్టూ ప్రహరీని కూలదోయించి స్థానికంగా ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాలను తీసుకొచ్చి దౌర్జన్యంగా ఆ స్థలంలో పాతిపెట్టించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని తమపై దౌర్జన్యం చేశారని, ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించారని వాపోయారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు శ్రీలక్ష్మి తండ్రి యేసువర్ధన్‌రావు, ఎమ్మెల్యేను వేడుకున్నారు. విచారణ చేయించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితులకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని