ఊపందుకోని ఖరీఫ్‌!

జులై సగాన పడినా.. ఖరీఫ్‌ ఊపందుకోలేదు. జూన్‌ మూడో వారం తర్వాత వర్షాలు మందగించడం ఒక కారణమైతే.. సాగు కలిసొస్తుందో లేదో అనే ఆందోళన మరో కారణం.

Published : 11 Jul 2024 04:22 IST

11 లక్షల ఎకరాల్లోనే పంటలు
రాయితీపై 6.62 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

ఈనాడు, అమరావతి: జులై సగాన పడినా.. ఖరీఫ్‌ ఊపందుకోలేదు. జూన్‌ మూడో వారం తర్వాత వర్షాలు మందగించడం ఒక కారణమైతే.. సాగు కలిసొస్తుందో లేదో అనే ఆందోళన మరో కారణం. నాలుగేళ్లుగా రైతులు పత్తి, వేరుశనగ, ధాన్యం.. ఏది సాగు చేసినా అప్పులే మిగిలాయి. పెట్టుబడులూ చేతికొచ్చే పరిస్థితి లేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఏ పంట వేయాలన్నా.. ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 81.22 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 11.27 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వేరుశనగ, పత్తి, వరి తదితర పంటల విస్తీర్ణం సాధారణం కంటే తగ్గింది. కాల్వలకు నీరు విడుదల చేస్తుండటంతో కృష్ణా, గోదావరి డెల్టాల్లో క్రమంగా వరి నారుమడులకు రైతులు సిద్ధమవుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులోకి నీరు చేరకపోవడంతో మిరప, వరి తదితర పంటల సాగుపై రైతుల్లో కొంత సందిగ్ధం నెలకొంది.  

రూ.309 కోట్ల రాయితీ 

ఖరీఫ్‌లో విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 6.62 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 3.50 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఇందులో 3.15 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 95 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 2.29 లక్షల క్వింటాళ్ల వరి, 22,150 క్వింటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలున్నాయి. రూ.309 కోట్ల రాయితీ అందించనున్నారు.

ప్రాథమిక సహకార కేంద్రాల్లోనే ఎరువులు

ఖరీఫ్‌ నుంచి ప్రాథమిక సహకార కేంద్రాల ద్వారా ఎరువుల్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌బీకేల్లో విక్రయాల్ని పక్కన పెట్టింది. ఖరీఫ్‌లో 17 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా... ఇప్పటికే 11.5 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. 2 లక్షల టన్నుల్ని విక్రయించారు. మార్క్‌ఫెడ్‌ వద్ద 1.10 లక్షల టన్నుల బఫర్‌ నిల్వలున్నాయి. 

రాయితీ పథకాలపైనే రైతుల ఆశలు 

గత ప్రభుత్వంలో రైతులకు రాయితీ పథకాలన్నీ దూరం చేశారు. వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు, సూక్ష్మపోషకాల పంపిణీని ఎత్తేశారు. సూక్ష్మసేద్యం పథకాన్నీ మొదటి మూడేళ్లు ఆపేశారు. చివరి రెండేళ్లూ నామమాత్రంగా అమలు చేశారు. రాయితీ పథకాల్ని పునరుద్ధరిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ నుంచే అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని