మచ్చపడ్డ మల్‌రెడ్డి మాతృ సంస్థకు!

గత ప్రభుత్వంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అన్నీ తానై చక్రం తిప్పిన కార్యనిర్వాహక సంచాలకులు(ఈడీ) ఏఎల్‌ మల్‌రెడ్డిని ప్రభుత్వం ఆయన మాతృసంస్థకు పంపింది.

Published : 11 Jul 2024 04:22 IST

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో మొదలైన ప్రక్షాళన

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అన్నీ తానై చక్రం తిప్పిన కార్యనిర్వాహక సంచాలకులు(ఈడీ) ఏఎల్‌ మల్‌రెడ్డిని ప్రభుత్వం ఆయన మాతృసంస్థకు పంపింది. తన మాతృ సంస్థ అయిన తెలంగాణ సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థకు పంపాలని ఈనెల 3న మల్‌రెడ్డి విజ్ఞప్తి చేయగా.. ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన వెంటనే పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి రిలీవ్‌ అయ్యారు. తెలంగాణ సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థలో పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న ఆయన 2019 అక్టోబరులో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు డిప్యుటేషన్‌పై వచ్చారు. జగన్‌ ప్రభుత్వంలోని పెద్దలు, సీఎంఓలోని కీలక అధికారి ఒకరు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ మల్‌రెడ్డిని ఏకంగా ప్రాజెక్ట్స్‌ విభాగం ఈడీ సీట్లో కూర్చోబెట్టారు. రుషికొండపై నిర్మాణాలు ఆయన హయాంలోనే మొదలయ్యాయి. పనుల పర్యవేక్షణ బాధ్యతకూడా ప్రభుత్వం మల్‌రెడ్డికే అప్పగించింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలోని ఇతర ప్రాజెక్టులనూ ఆయనే పర్యవేక్షించారు. ఇడుపులపాయలో వైఎస్‌ విగ్రహాల ఏర్పాటు, ఇతర పనులు, ఇందుకు సంబంధించిన టెండర్లలో మల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ విషయంలో ఒక గుత్తేదారు సంస్థకు ఆయన సహకరించారనే ఆరోపణలూ వచ్చాయి. పులివెందులలో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థకు చెందిన క్లబ్‌ హౌస్‌ కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలపైనా ఎండీ తరఫున మల్‌రెడ్డే సంతకం చేశారు. ప్రస్తుతం మరో కార్యనిర్వాహక సంచాలకురాలు పద్మావతికి ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈడీ మల్‌రెడ్డిని బదిలీ చేయడంతో పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రక్షాళన మొదలైనట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని