వెంటాడుతున్న అరెస్టు భయం

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా సీనియర్‌ నేతలను అరెస్టు భయం వెంటాడుతోంది. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు క్యూ కడుతున్నారు.

Published : 11 Jul 2024 04:27 IST

హైకోర్టులో వైకాపా నేతల వరుస పిటిషన్లు
తాజాగా వ్యాజ్యాలు దాఖలుచేసిన సజ్జల, ఆళ్ల 

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా సీనియర్‌ నేతలను అరెస్టు భయం వెంటాడుతోంది. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. 

మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిలు కోసం వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైకాపా నేత దేవినేని అవినాష్‌ దాఖలుచేసిన వ్యాజ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి స్పందిస్తూ ఈ వ్యాజ్యాలపై ఏజీ వాదనలు వినిపిస్తారన్నారు. గురువారానికి వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి స్పందిస్తూ.. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు తాజాగా పిటిషన్లు వేశారన్నారు. ప్రస్తుత వ్యాజ్యాలను వాటితో కలిపి విచారించాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ విచారణను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి జోగి రమేశ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ సైతం గురువారానికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని