పిన్నెల్లి బెయిల్‌పై తీర్పు 18న

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లపై న్యాయమూర్తి శరత్‌బాబు తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు.

Published : 11 Jul 2024 04:28 IST

గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లపై న్యాయమూర్తి శరత్‌బాబు తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు. గురజాల అదనపు జిల్లా కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా ఉన్న గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వద్ద బుధవారం వాదనలు జరిగాయి. పోలింగ్‌ రోజు పాల్వాయిగేటు బూత్‌లో నంబూరి శేషగిరిరావుపై దాడి, మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామి మీద దాడి ఘటనలపై నమోదైన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లను గురజాల అదనపు జిల్లా కోర్టులో దాఖలు చేయగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డిపై కేసులు పెట్టారని, తొలుత నమోదు చేసిన కేసుల్లో ఆయన పేరు లేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కారంపూడి సీఐకి తగిలిన గాయాలు స్వల్పమైనవన్నారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన అశ్వినీకుమార్‌ వాదనలు కొనసాగిస్తూ... రెండు ఘటనల్లో రామకృష్ణారెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, హైకోర్టు దీనిని గుర్తించి ముందస్తు బెయిల్‌కు నిరాకరించిందని తెలిపారు. పోలీసుల విచారణకు రామకృష్ణారెడ్డి సహకరించడం లేదని, ఎన్నికల రోజు పోలింగ్‌ బూత్‌లోకి తాను వెళ్లలేదని, వీడియోలో ఉన్న సంగతీ తనకు తెలియదని చెప్పారన్నారు. మరోపక్క వైకాపా అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ... రిగ్గింగ్‌ను నిరోధించడానికి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టినట్లు ఒప్పుకొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని న్యాయమూర్తిని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి శరత్‌బాబు తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు