AP Cabinet: క్యాబినెట్‌లో యువరక్తం

ఉరకలెత్తే యువరక్తం.. సామాజిక సమతూకం.. అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం. రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపు.. ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో, కొత్త రూపుతో కళకళ్లాడుతోంది.

Updated : 13 Jun 2024 09:50 IST

ప్రభుత్వానికి ‘ఫ్రెష్‌ లుక్‌’ ఇవ్వడమే లక్ష్యం
మొదటిసారి ఆ ‘సీనియర్లు’ లేని మంత్రివర్గం
ప్రభుత్వానికి కొత్తరూపు ఇచ్చేందుకు  సాహసోపేత నిర్ణయం
ప్రాంతాలు, వర్గాలవారీగా సమతూకం
యువతకు, మహిళలకు అగ్ర పీఠం
పార్టీకి వెన్నెముకలాంటి బీసీలకు సముచిత ప్రాధాన్యం
ఈనాడు - అమరావతి

ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.
చిత్రంలో భువనేశ్వరి, గవర్నర్‌ సతీమణి సమీరా నజీర్, సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌

ఉరకలెత్తే యువరక్తం.. సామాజిక సమతూకం.. అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం. రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపు.. ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో, కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతోపాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి, మరో 30-40 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. తెదేపా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం! వారితో పాటు మరి కొందరు సీనియర్లకూ వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటి వరకు తెదేపా అధికారంలోకి వచ్చాక.. స్పీకర్‌గా పనిచేసిన కాలంలో తప్ప, మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజార్టీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని క్యాబినెట్‌లోకి తీసుకోకుండా, మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక.. దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

ఉరకలెత్తే ఉత్సాహం.. 

మంత్రివర్గం కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు, మరీ ముఖ్యంగా తెదేపాకు వెన్నెముక వంటి బీసీలకు అగ్రప్రాధాన్యమిస్తూనే, వారిలోంచి యువతకు చోటు కల్పించి ప్రభుత్వానికి కొత్త రూపునిచ్చేందుకు చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. ప్రస్తుత క్యాబినెట్‌లో 24 మందిలోనూ తొలిసారి మంత్రులైనవారు 17 మంది ఉండటం విశేషం. అంతేకాదు.. తొలిసారి ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. ఎనిమిదిమంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో రెండు విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్టయింది. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ను, భాజపా నుంచి సత్యకుమార్‌ను క్యాబినెట్‌లో చేర్చుకోవడంతో పాటు, తెదేపా నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో.. ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది. తెదేపాను స్థాపించి నాలుగు దశాబ్దాలు దాటింది. పార్టీలో యువత ప్రాతినిధ్యాన్ని పెంచి, పార్టీకి జవసత్వాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే కేబినెట్‌ కూర్పులో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. తెదేపాను అంటిపెట్టుకుని ఉండే ఒక ప్రధాన సామాజికవర్గానికి కృష్ణా జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. 

మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబుతో కరచాలనం చేసి ఆనందాన్ని పంచుకుంటున్న పవన్‌కల్యాణ్‌ 

తాజాదనం కోసం.. ఆచితూచి ఎంపిక 

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే మంత్రివర్గ సభ్యుల్ని ఎంపిక చేసే క్రమంలో అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారని అర్థమవుతుంది. విజయనగరం జిల్లా నుంచి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్‌ను ఎంపిక చేసినా, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్‌కు అవకాశమిచ్చినా... పార్టీకి ‘ఫ్రెష్‌ లుక్‌’ తెచ్చే ప్రయత్నంలో భాగమే. ఇక డేషింగ్‌గా ఉండటం, రాజకీయ ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చే స్వభావం వంటివి వంగలపూడి అనితకు కలిసొచ్చాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరూ కొత్తవారికే అవకాశమిచ్చారు. జనసేన నుంచి నుంచి దుర్గేష్‌కు, తెదేపా నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశం వచ్చింది. తెదేపా విపక్షంలో ఉన్న ఐదేళ్లలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా అసెంబ్లీలో రామానాయుడు పోరాటతత్వాన్ని ప్రదర్శించారు. అనేక సందర్భాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. ప్రకాశం జిల్లా నుంచి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలకు మొదటిసారి అవకాశం లభించింది. గత ఐదేళ్లలో వైకాపా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడడం వారికి సానుకూల అంశమైంది. గత ఐదేళ్లలో పార్టీ విప్‌గా శాసనసభలో స్వామి మెరుగైన పనితీరు కనబరిచారు. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశమిచ్చారు. అలాగే వైకాపా అధికారంలో ఉండగా అంగళ్లు, పుంగనూరుల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అనేక కేసులు ఎదుర్కోవడంతో పార్టీ దృష్టి రాంప్రసాద్‌రెడ్డిపై పడింది. కడప జిల్లా నుంచి అలాంటి నాయకత్వం కోసం పార్టీ చూస్తోంది. అక్కడ మంత్రి పదవిపై రాంప్రసాద్‌రెడ్డికి, మాధవీరెడ్డికి పోటీ నెలకొన్నా.. ప్రస్తుతానికి ఆయన వైపే పార్టీ మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో సంప్రదాయంగా కేఈ, భూమా కుటుంబాల మధ్యే పోటీ ఉండేది. మంత్రివర్గంలో వారికే చోటు దక్కుతూ ఉండేది. ఈసారి ఆ రెండు కుటుంబాల్ని కాదని.. బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లకు పార్టీ అవకాశమిచ్చింది. 

వేదికపై సీఎం రమేశ్, బాలకృష్ణ, రజనీకాంత్‌ దంపతులు, చిరంజీవి, శివప్రకాశ్, పురందేశ్వరి, బీఎల్‌ సంతోష్,
బండి సంజయ్, ఏక్‌నాథ్‌ శిందే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, నితిన్‌ గడ్కరీ, రామ్‌దాస్‌ అథవాలె,
జేపీ నడ్డా, అమిత్‌ షా, చిరాగ్‌ పాశ్వాన్, వెంకయ్యనాయుడు, రామ్మోహన్‌నాయుడు


తొలి గెలుపుతోనే సత్యకుమార్‌కు మంత్రి పదవి

ఈనాడు, అమరావతి: తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన సత్యకుమార్‌ను అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయవచ్చని మొదట భావించారు. కానీ.. పార్టీ ఆయనను అసెంబ్లీ బరిలోకి దించింది. రాయలసీమకు చెందిన సత్యకుమార్‌ ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రత్యర్థిపై 3,734 ఓట్ల తేడాతో గెలుపొందారు. భాజపా తరపున శాసనసభకు ఎన్నికైన 8 మందిలో మంత్రి పదవికి మొదట కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. జాతీయ నాయకత్వం సత్యకుమార్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సుదీర్ఘకాలం పాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సమయంలో పార్టీ అగ్రనేతలతో ఏర్పడ్డ పరిచయాలు సత్యకుమార్‌ స్థాయిని పెంచాయి. ప్రస్తుతం భాజపా జాతీయ కార్యదర్శిగా, అండమాన్, నికోబార్‌ ద్వీపాల ఇంఛార్జిగా, ఉత్తరప్రదేశ్‌ సహ ఇంఛార్జిగా సత్యకుమార్‌ వ్యవహరిస్తున్నారు. జాతీయ కార్యదర్శి హోదాలో మూడోసారి కొనసాగే అవకాశాన్ని పార్టీ అధిష్ఠానం సత్యకుమార్‌కు మాత్రమే కల్పించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని