Andhra News: టిడ్కో ఇళ్లకు మంచి రోజులు

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి.

Published : 08 Jul 2024 05:49 IST

వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైనం
రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి
నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిడ్కో
ఈనాడు - అమరావతి 

న్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తంచేసింది. రూ.2వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

అప్పట్లో రుణమిచ్చేందుకు ససేమిరా

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు. కానీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు. బ్యాంకులూ వెనకడుగు వేశాయి. ప్రభుత్వమూ నిధులు కేటాయించలేదు. దీనికి జగన్‌ అనుసరించిన విధానాలే కారణం. ఫలితంగా 2.62 లక్షల గృహాలను పూర్తిచేయాల్సి ఉండగా... ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90%పైగా 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చాలావరకు పూర్తయినవే. తెదేపా కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారు.

మొత్తం పూర్తికి రూ.5 వేల కోట్లు అవసరం

రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టు అధికారికలెక్కలు చెబుతున్నాయి. ఇందుకు రూ.5వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు రూ.1,300 కోట్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సినది రూ.1,500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అక్కడినుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగిరం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 

గుత్తేదారులకు రూ.473 కోట్లు పెండింగ్‌

వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయకపోగా.. గుత్తేదారులకు బిల్లులూ చెల్లించలేదు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇళ్లు కట్టినవారికి ఇప్పటివరకు బిల్లులివ్వలేదు. ఇవన్నీ కలిపి దాదాపు రూ.473 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. వీరందరూ కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు