Andhra News: వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై మళ్లీ బదిలీ వేటు

వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ పెద్దల అక్రమాలకు కొమ్ముకాశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న అత్యంత వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖకు ఎటాచ్‌ చేసింది.

Updated : 25 Jun 2024 08:13 IST

దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం
జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశం

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ పెద్దల అక్రమాలకు కొమ్ముకాశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న అత్యంత వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖకు ఎటాచ్‌ చేసింది. ఈ నెల 19న జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనను కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం..వారం రోజులు కూడా తిరక్కుండానే అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయమని ఆదేశించింది. 2019 ఎన్నికలనాటికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ద్వివేది.. అప్పటి అధికార పక్షమైన తెదేపాను ముప్పుతిప్పలు పెట్టి, వైకాపాకు అడ్డగోలుగా మేలు చేసేలా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. దానికి తగ్గట్టే వైకాపా అధికారంలోకి వచ్చాక పోస్టింగుల్లో ఆయనకు అసాధారణ ప్రాధాన్యం దక్కింది. మొదట ఆయనను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం.. 2020 మార్చి నుంచి గనులశాఖను పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. రెండేళ్ల క్రితం ఆయనను వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం, గనుల శాఖను మాత్రం ఆయన వద్దే ఉంచింది. గత ఐదేళ్లలో ఆయన వైకాపా పెద్దలపై కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలు, వాటర్‌ ట్యాంకులకు వైకాపా జెండా రంగులను పోలిన రంగులు వేయించడం, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్యకేంద్రాల భవనాలకు రూ.10 వేల చొప్పున ప్రజాధనాన్ని వెచ్చించి నవరత్నాల లోగోలు వేయించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. రంగులపై కోర్టు అక్షింతలు వేయడంతో వాటిని తొలగించారు. రంగులు వేయడానికి, తీయడానికి రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారు. 

ః 2019 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా ద్వివేది ఇబ్బందులు పెట్టారు. కోర్టు ఆదేశాలనూ పెడచెవిన పెట్టారు. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారు తప్ప బిల్లులు మాత్రం చెల్లించలేదు. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన వైకాపా పెద్దల అక్రమాలకు వంతపాడారు. అతిపెద్ద ఇసుక కుంభకోణానికి పూర్తి సహకారం అందించారు. ఈ నెల 19న జరిగిన బదిలీల్లో ప్రభుత్వం ఆయనను కార్మికశాఖకు బదిలీ చేస్తూ, మైనింగ్‌ శాఖను అదనపు బాధ్యతగా ఆయనకే ఉంచడం అధికార వర్గాలను షాక్‌కు గురిచేసింది. అధికార పార్టీలోనూ దీనిపై తీవ్ర చర్చ జరిగింది. దాంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఆయన నుంచి గనులశాఖ బాధ్యతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, కార్మికశాఖ నుంచి కూడా బదిలీ చేసి, జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని