Visakhapatnam: జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ బదిలీ

అత్యంత వివాదాస్పద అధికారిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

Published : 10 Jul 2024 04:29 IST

అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు
వైకాపా నాయకులకు అడ్డగోలుగా పనులు చేశారని ఆరోపణలు 

ఈనాడు, అమరావతి: అత్యంత వివాదాస్పద అధికారిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్‌కు ఛార్జ్‌ అప్పగించాల్సిందిగా ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఏపీ టిడ్కో ఎండీగా నియమించింది. ప్రస్తుతం టిడ్కో ఎండీగా ఉన్న సీహెచ్‌.శ్రీధర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతానికి ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం (అర్బన్‌) ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న బి.సుబ్బారావును బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా నియమించింది. జీవీఎంసీ కమిషనర్‌గా సాయికాంత్‌ వర్మ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వైకాపా నాయకులతో అంటకాగుతూ, వారికి అనుకూలంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ నగర నడిబొడ్డున సీబీసీఎన్‌సీ స్థలంలో చేపట్టిన భవన నిర్మాణ ప్రాజెక్టుకు సాయికాంత్‌ వర్మ అనుమతులు మంజూరు చేశారు. అది వివాదాస్పద స్థలమని తెలిసినా అనుమతులివ్వడంతో పాటు, రూ.63 కోట్ల టీడీఆర్‌ బాండ్లూ కట్టబెట్టారు. ఎంవీవీ ప్రాజెక్టు కోసం టైకూన్‌ కూడలిని మూసేసి.. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. భోగాపురం చుట్టుపక్కల బినామీల పేరుతో పేదల నుంచి పెద్దఎత్తున ఎసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఇటీవలే పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారిని... సాయికాంత్‌ వర్మ స్వయంగా కారు నడుపుతూ ఆ భూముల పరిశీలనకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఇంకా హయగ్రీవ భూములు వైకాపా నాయకుల హస్తగతమయ్యేలా చేయడం, దసపల్లా భూముల్లో 40 అడుగుల రహదారిని 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వంటి వ్యవహారాల్లో సాయికాంత్‌ వర్మ తీరు తీవ్ర వివాదాస్పదమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని