MVV The Peak: ఆది నుంచి అక్రమాల పర్వం

అధికారం అండగా విశాఖలో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమంగా చేపట్టిన భారీ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడుతోంది. సిరిపురం రహదారిలోని సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ నార్తర్న్‌ సర్కార్‌) స్థలంలో ‘ఎంవీవీ పీక్‌ వెంచర్‌’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు ‘స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌’ ఇచ్చారు.

Updated : 24 Jun 2024 06:46 IST

సీబీసీఎన్‌సీ స్థలంలో వైకాపా మాజీ ఎంపీ ‘ఎంవీవీ పీక్‌ వెంచర్‌’
వివాదాల మధ్యే ప్రాజెక్టుకు అడుగులు
తాజాగా పనులు ఆపాలన్న జీవీఎంసీ అధికారులు

సీబీసీఎన్‌సీ స్థలంలో తవ్వకాలు

ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే: అధికారం అండగా విశాఖలో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమంగా చేపట్టిన భారీ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడుతోంది. సిరిపురం రహదారిలోని సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ నార్తర్న్‌ సర్కార్‌) స్థలంలో ‘ఎంవీవీ పీక్‌ వెంచర్‌’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు ‘స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌’ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు చేపడుతున్న స్థల వ్యవహారం మొదలుకుని అనుమతుల వరకు ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన, అక్రమాలవంటి ఆరోపణలున్నా అధికారం దన్నుతో జీవీఎంసీపై ఒత్తిళ్లు తెచ్చి ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా ఎంవీవీ చూసుకున్నారు. తాజాగా బండరాళ్ల పేలుళ్లకు అనుమతుల గడువు ముగిసినప్పటికీ యథేచ్ఛగా ప్రాజెక్టు స్థలంలోని రాళ్ల తొలగింపునకు రాత్రీపగలు పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పనులు నిలిపేశారు. ప్రాజెక్టుకు రోడ్డు పోటు ఉందన్న కారణంగా టైకూన్‌ కూడలి మూసివేత, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను గతేడాది వారాహి యాత్ర సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు.

అప్పట్లో అడ్డగోలుగా ప్లాను

సీబీసీఎన్‌సీ నిర్మాణ ప్రాజెక్టుపై మొదటినుంచి వివాదాలు ఉండటంతో ముగ్గురు కమిషనర్లు జి.సృజన, లక్ష్మీశ, రాజాబాబు ప్లానుకు అనుమతులనివ్వలేదు. కమిషనర్‌ సృజన హయాంలో స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చారు. అధికారం అండతో ఎంవీవీ చక్రం తిప్పడంతో 2041 మాస్టర్‌ప్లాన్‌ను తెరపైకి తెచ్చి ఎంవీవీ పీక్‌వెంచర్‌లో 34 అంతస్తుల భవనాలకు అనుమతులొచ్చేలా జీవీఎంసీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేకంగా సర్వీసు రహదారి ఉండాలి. దానినీ నిర్మాణదారు చూపించకపోయినా.. జీవీఎంసీ అధికారులు కళ్లు మూసుకుని ప్లాన్‌ మంజూరు చేశారు.

ఆ రెండు జీవోలపై దృష్టి

ఎంవీవీ ప్రాజెక్టు ప్లాను రద్దుకున్న అవకాశాలను తాజాగా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీబీసీఎన్‌సీ భూములు 18 కంపెనీలకు చెందినవంటూ వారికి రిజిస్ట్రేషన్‌ చేయించడంతోపాటు రుసుములు వసూలు చేస్తూ తెదేపా హయాంలోనే రెండు జీవోలనిచ్చారు. వాటిని అడ్డుపెట్టుకుని యాజమాన్య హక్కులు పొందిన వ్యక్తులు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీతో డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రెండు జీవోలను ఉపసంహరించేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రాజెక్టు నిలిచిపోయే అవకాశాలున్నాయి.


టీడీఆర్‌లు స్వాహా

సీబీసీఎన్‌సీ స్థల యాజమాన్య హక్కులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంతోపాటు కాకినాడ, విశాఖ జిల్లా కోర్టుల్లోనూ కేసులున్నాయి. అలాంటి వివాదాస్పద స్థలంలో ఎంవీవీ పాగా వేశారు. అంతేనా.. మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు విస్తరణలో స్థలం పోతుందని ఏకంగా రూ.63 కోట్ల టీడీఆర్‌లు దక్కించుకున్నారు. వాస్తవానికి 18 రిజిస్ట్రేషన్ల ఆధారంగా డెవలప్‌మెంట్‌ హక్కులు ఎంవీవీ పొందినప్పటికీ వారిలో ఎవరెవరి స్థలం ఎంత రహదారి అభివృద్ధిలో పోయిందన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని