Andhra News: వైద్య నారాయణులకూ వేతనాల వెతలు!

వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.

Updated : 10 Dec 2022 08:29 IST

ఆరోగ్య శాఖలో జీతాలందక ఇక్కట్లు  
కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన
అంబులెన్సు వైద్యులదీ అదే పరిస్థితి

ఈనాడు-అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు, ఆశాలు, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు, ఇతర విభాగాల ఉద్యోగులు ఉన్నారు. ప్రతినెలా తొలి వారంలోనే ఇచ్చే జీతాలు ఇప్పటివరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య సుమారు 20,000 వరకు ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యులు, పారా మెడికల్‌, కింది స్థాయి సిబ్బంది నవంబరు వేతనాలు చెల్లించేందుకు కనీసం రూ. 55 కోట్లు కావాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వక వేతనాల చెల్లింపులు సకాలంలో జరగడంలేదు. ఇలాగైతే ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క.. వీరికి వేతనాలు పెంచుతామని గత ఆగస్టు నుంచి ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పటివరకు ఉత్తర్వులు రాకపోవడం పట్ల మండిపడుతున్నారు. కేడర్‌ను అనుసరించి 22%-40% మధ్య వేతనాలు పెరగాల్సి ఉంది.

అత్యవసర ఉద్యోగులకూ అంతే..  

రాష్ట్రంలో 108 అంబులెన్సు సర్వీస్‌ కింద అన్ని స్థాయుల్లో కలిపి సుమారు 6,500 మంది, 104 సంచార వైద్యశాల పథకం కింద 2,500 మంది పనిచేస్తున్నారు. వీరిలో వైద్యులూ ఉన్నారు. వీరందరికీ అక్టోబరు, నవంబరు వేతనాల చెల్లింపులు ఇప్పటి వరకు జరగలేదు. 108, 104 నిర్వహణ సంస్థలకు మూడునెలలకొకసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 78 కోట్లు ఇవ్వాలి. వాటి విడుదలలో జరుగుతున్న జాప్యం వేతనాల చెల్లింపులపై పడుతోంది. అలాగే.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం కింద పనిచేసే సుమారు 500 మందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. ఉప ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే కమ్యూనిటీ ఆఫీసర్లకు (ఎంఎల్‌హెచ్‌పీ) మూడు, నాలుగు నెలల నుంచి ప్రోత్సాహక నగదు చెల్లింపులు జరగడంలేదు. ఒక్కొక్కరికి కనీసం నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఇవ్వాలి.

రూ. 7,200 చేతిలో పెట్టారు

ఆశా కార్యకర్తలకు నెల వేతనంలో ఇప్పటివరకు రూ. 7,200 మాత్రమే చెల్లించారు. మరో రూ. 2,800 చెల్లించాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. రాష్ట్రంలో సుమారు 41,000 మంది ఆశాలు పనిచేస్తున్నారు.

‘కొవిడ్‌’ వేతనాలు ఇప్పుడు..

కొవిడ్‌ సేవలు అందించిన వైద్యులు, మరికొందరికి ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదు. వారి సంఖ్య 5,000 వరకు ఉంది. హైకోర్టు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సుమారు రూ. 50 కోట్లను ఇటీవల జిల్లాలకు పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని